సిటీబ్యూరో, మార్చి 17(నమస్తే తెలంగాణ) : శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి పార్కింగ్ అతి పెద్ద సమస్యగా మారుతున్నది. నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నా అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏటా 20 శాతానికిపైగా కొత్త వాహనాలు నగరంలో రోడ్డెక్కుతున్నట్లు అంచనాలు ఉండగా, ఈ లెక్కన వచ్చే ఐదేండ్లలో మరో 25 లక్షల నూతన వాహనాలు సిటీలో సంచరించనున్నాయి.
సరిపడా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో..
గ్రేటర్లో నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఇందులో సగానికి పైగా వాహనాలకు సరిపోయే పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచాల్సి వస్తున్నది. దీంతో అనివార్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుండగా.. రానురాను ఇది మరింత జఠిలమైతున్నది. నగరంలో ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ యార్డులను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ, మెట్రో, ఇతర శాఖలతో కలిసి నగరంలో 75కు పైగా అధునాతన పార్కింగ్ యార్డులను నిర్మించాలని ప్రతిపాదించారు. తొలి దశలో 25 ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ యార్డులను నిర్మించడానికి ఆమోదం తెలిపారు.
పైలట్ ప్రాజెక్టుగా నగరంలో తొలి మల్టీ లెవల్ పార్కింగ్ యార్డును మెట్రో సంస్థ నిర్మించడం మొదలుపెట్టింది. కానీ మెట్రో సంస్థకు ఇది గిట్టుబాటు కాకపోవడంతో గడిచిన కొంత కాలంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. నాంపల్లి వద్ద 12 అంతస్తుల ఎత్తులో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణంతో ఏకంగా 300-400 వాహనాలను నిలిపివేసే అవకాశమున్నది. కానీ ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంపై కాంగ్రెస్ సర్కారు ఆసక్తి చూపడం లేదు. కానీ కేబీఆర్ పార్కు వద్ద 30 వాహనాలు నిలిపే మల్టీ లెవల్ పార్కింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలాన్ని ఓ ఏజెన్సీకి కట్టబెట్టి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువే. దీంతోపాటు పరిమిత వాహనదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. నాంపల్లిలో ఉన్న మల్టీ లెవల్ పార్కింగ్ స్థలానికి కంటే… కేబీఆర్ మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాజెక్టును సర్కారు ఉరుకులు పరుగుల మీద చేపడుతున్నది. ఈ ప్రాజెక్టును చివరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలోనూ తిరస్కరిస్తే, కేవలం ఈ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రయోజనం ఉందని.. శరవేగంగా మళ్లీ తెరమీదకు తీసుకువచ్చారు.
పార్కింగ్ పేరిట నిలువు దోపిడీ..
నగరంలోని కొన్ని హోటళ్లు, పెద్ద పెద్ద కార్యాలయాల వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. మరోవైపు ప్రస్తుతం వ్యాలెట్ పార్కింగ్ పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్లకు వచ్చే వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో రక్షణ లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే హెచ్ఎండీఏ పరిధిలోని బీపీపీలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో పలు చోట్ల పార్కింగ్ యార్డుల నిర్వహణ టెండర్ల ప్రతిపాదికన కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆ ప్రాంతంలో పెండింగ్లో టెండర్లను మళ్లీ పిలవకుండా… 9 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తికి పార్కింగ్ వసూలు చేసుకునే బాధ్యతలు అప్పగించారు. నిజానికి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ పనులను కట్టబెట్టి, లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. ఆ తర్వాత విషయం వెలుగులోకి రావడంతో హెచ్ఎండీఏ కమిషనర్ చొరవ తీసుకుని బీపీపీ పరిధిలో పార్కింగ్ టెండర్లకు చర్యలు తీసుకున్నారు.
రోడ్లపైనే వాహనాలు
కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ఉదయాన్నే వచ్చే వాహనదారులకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలుపుతుంటారు. దీనికి సమీపంలోనే ఎకరం విస్తీర్ణంలోనే ప్రభుత్వ జాగా ఉన్నా… అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం లేదు. ఇదే విషయాన్ని పలువురు కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం పార్కు భూములకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కానీ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ పేరిట అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ… కేబీఆర్ పార్క్ స్థలాన్ని ఏజెన్సీకి పప్పు బెల్లంలా పంచిపెట్టేందుకు సిద్ధమైంది. అదేవిధంగా ఇప్పటికీ మెట్రో స్టేషన్ల వద్ద సరైన పార్కింగ్ యార్డు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలిపి ఉంచాల్సిన పరిస్థితి ఉంది.
మల్టీ లెవల్ పార్కింగ్ యార్డులే పరిష్కారం..
నగరంలో ఉత్పన్నమవుతున్న పార్కింగ్ సమస్యపై శాస్త్రీయ పరిశీలన జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పార్కింగ్ సమస్య పరిష్కారానికి బహుళ అంతస్తుల్లో పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మిస్తే గానీ ఫలితం ఉండదని ఇప్పటికే పలువురు అర్బన్ ట్రాన్స్ పోర్టు నిఫుణులు చేసిన అధ్యయనంలో తేలింది. ఇదే పెరుగుతున్న వాహనాలకు పార్కింగ్ విరుగుడుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వమే ప్రస్తుతం ఉన్న వాహనాలు, వచ్చే పదేండ్ల తర్వాత నగరంలో పెరగబోయే వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ స్థలాల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది.
కానీ గడిచిన ఏడాది కాలంగా నగరంలో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కారానికి ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పెట్ట లేదు. కానీ ట్రాఫిక్ నియంత్రణపై వాహనదారులపై వేల రూపాయాల చలాన్లతో వేధిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వంలో పెద్ద ఎత్తున్న నగరంలో పార్కింగ్ యార్డులను నిర్మించేలా ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రతిపాదన దశలో ఉన్న పార్కింగ్ యార్డుల నిర్మాణానికి ప్రభుత్వ స్వప్రయోజనాలు మరిచి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిటీ జనాలు కోరుతున్నారు.