బల్దియా మార్గనిర్దేశాల మేరకు అన్ని వాణిజ్య సంస్థలు, నిర్దిష్టమైన నమూనాలో పార్కింగ్ టిక్కెట్లను ముద్రించాలి. టిక్కెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్ నెంబరు ఉండాలి. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’అని, ఉచితమైతే ఎగ్జెంప్టెడ్’ అని స్టాంపు వేయాలి. పార్కింగ్ ఇన్‌ఛార్జి సంతకంతో కూడాని పార్కింగ్ టిక్కెట్లను వాహనాలు నిలిపిన వారందరికీ ఇవ్వాలి. పా ర్కింగ్ టికెట్లపై ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ తప్పనిసరిగా ముద్రించాలి. పార్కింగ్ పాలసీపై జీహెచ్ఎంసీ మార్గనిర్దేశకాలను ప్రతి కాంప్లెక్స్‌లో పెద్ద పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేయాలి.
నగరంలో ఎక్కడైనా సరే మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల నుంచి గంట వరకైతే… షాపింగ్ రసీదు చూపిస్తేనే ఉచిత పార్కింగ్ సౌలభ్యం ఉంటుంది. ఆపై సమయాలకు సంబంధిత మాల్ నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేయాలి. ఇది ఉచిత పార్కింగ్ విధానాన్ని ప్రకటిస్తూ పురపాలక శాఖ 2018 మార్చి 20న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల కోరిక మేరకు ఉచిత పార్కింగ్ నుంచి వారికి ఇటీవల మినహాయింపునిచ్చింది. ఈ మినహాయింపును సాకుగా చూపి అనేక కమర్షియల్ కాంప్లెక్స్‌లు బల్దియా ఆదేశాలకు వ్యతిరేకంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
పార్కింగ్ ఫీజు వసూలు చేసే విషయమై బల్దియా విడుదల చేసిన మార్గనిర్దేశాలపై చాలా మందికి అవగాహన లేకపోవడం వల్లే ఆయా కాంప్లెక్స్‌లు అడ్డగోలు వసూళ్లకు దిగుతున్నాయి. ఏదైనా ఓ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించగానే.. బల్దియా ఉత్తర్వులతో నిమిత్తం లేకుండా ‘ఇదిగో..పెయిడ్ పార్కింగ్’ అంటూ ఓ రసీదు చేతిలో పెడుతున్నారు. ఏదైనా చెప్పబోతే..‘ఇక్కడింతే’ అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి గంటకు రూ.10 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. కార్లకు రూ.40 నుంచి వంద వరకు ఉంటుం ది. పార్కింగ్ పాలసీపై బల్దియా మార్గదర్శకాలేవీ అక్కడ కనిపించేలా ఉంచరు. పార్కింగ్ వసూలు చేసేవారికి వీటిపై అవగాహన ఉండదు. దీంతో చాలా సార్లు వాహనదారులకు, పార్కింగ్ నిర్వాహకులకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కొన్ని కాంప్లెక్స్‌లు పార్కింగ్ నిర్వహణను బయటి వ్యక్తులకు అప్పగిస్తున్నాయి. అటువంటి వారు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. అన్ని రకాల అనుమతులున్నాయి కాబట్టి తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని దబాయిస్తుంటారు.
ఎక్కడ ఉచితం?