వెంగళరావునగర్, డిసెంబర్ 24 : రాత్రి వేళల్లో పార్కింగ్ చేసిన ఆటోలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను మధురానగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 6 ఆటోలను స్వాధీనం చేస్తున్నారు. మంగళవారం మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ రవికుమార్‌తో కలిసి పంజాగుట్ట డివిజన్ ఏసీపీ మోహన్ కుమార్ వివరాలు వెల్లడించారు. శంషాబాద్‌కు చెందిన కల్యం వెంకటేశ్ ఆటోడ్రైవర్.
అయితే వచ్చే డబ్బు సరిపోకపోవడంతో ఆటోలను చోరీచేసి విక్రయించాలకున్నాడు. అందుకు శంషాబాద్‌లో ఉండే స్నేహితులు పాముల రాజు, తూర్పాటి శ్రీశైలంలను కలుపుకున్నాడు. ఇలా ముగ్గురు ముఠాగా ఏర్పడి.. రాత్రి వేళల్లో నగరంలో పార్కింగ్ చేసే ఆటోలను గుర్తించి అపహరించుకెళ్లి విక్రయించేవారు. ఒక్కో ఆటోను రూ.20 నుంచి రూ.25వేలకు విక్రయించి వచ్చిన డబ్బును పంచుకునేవారు.
అయితే చోరీ చేసిన ఆటోలో ఈ ముగ్గురు వెళ్తూ యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆటోల చోరీ విషయం బయటపడింది. కాగా.. వారివద్ద ఆటోను కొనుగోలు చేసిన ఇబ్రహీంపట్నంకు చెందిన ఏడుల కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ ప్రాంతానికి చెందిన జవహర్‌కు మరో ఆటోను విక్రయించినట్లు తేలింది. వారి నుంచి ఆరు ఆటోలను స్వాధీనం చేసుకుని.. నిందితులు వెంకటేశ్, రాజు, శ్రీశైలం, కుమార్‌లను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.