హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన మన బస్తీ – మన బడి కార్యక్రమంపై హోం మంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వారం రోజుల్లోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్ మెంట్ (SMC) కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తరగతి గదుల మరమ్మతులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, ప్రహరీగోడ నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బోధన జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.
ఇందుకోసం చేపట్టిన మన బస్తీ -మన బడి కార్యక్రమం పనుల పర్యవేక్షణలో ఎస్ఎంసీ లను భాగస్వాములను చేయడం ద్వారా పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. డిప్యూటీ డీఈవోలతో పాఠశాల్లో జరుగుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. నాది అనే భావనతో ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సుల్తాన్ బజార్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పూర్తిస్థాయిలో నిర్మించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ సిద్ధంగా ఉందని, ప్రభుత్వ పరంగా అనుమతులు కావాల్సి ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొనగా.. బుధవారం మధ్యాహ్నం ఆ పాఠశాలను అధికారులతో కలిసి సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.