మేడ్చల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కుట్ర పూరితంగానే కొందరు విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగానే నిర్వహిస్తున్నప్పటికీ కావాలనే లీకేజీలు చేస్తూ ప్రభుత్వాన్ని అ ప్రతిష్టపాలు చేస్తున్న నిందితులను వదలవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
కొంతమంది కుట్ర పూరితంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో పంపడం దారుణం. పదవ తరగతి పరీక్షలు ప్రభుత్వ పరంగా విద్యాశాఖ పకడ్బందీగా నిర్వహిస్తున్నది. ఎక్కడ కూడా పేపర్ లీక్ కాలేదు. ఉపాధ్యాయులు పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరో చేస్తున్న కుట్రలకు ఉపాధ్యాయులు బలికావాల్సి వస్తుంది. ఇది మంచి పద్ధతికాదు. కుట్రపూరిత విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారు.
– రమేశ్వర్గౌడ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు
కఠినంగా శిక్షించాలి
కష్టపడి చదివిన పిల్లల భవిష్యత్‌తో ఆటలు అడవద్దు. స్వార్థ రాజకీయాలకు విద్యార్థులను ఎందుకు బలి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు ఆర్థం అవుతుంది. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే కొందరిని పోలీసులు పట్టుకోవడం మంచి పరిణామం.
-జంగయ్య, కీసర
దుర్మార్గులను వదలవద్దు
స్వార్థపూరిత రాజకీయాల కోసం పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంతో కష్టపడి చదవిన మా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనున్నది. రోజుకో కొత్తనాటకం ఆడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న దుర్మార్గులను ఎట్టి పరిస్థితిలో వదలవద్దు.
– శాగ వెంకటేశ్, జవహర్‌నగర్ గబ్బిలాల్పేట
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
తెలంగాణలో విద్యారంగంపై మింగుడు పడకే కొంత మంది కుట్రలు చేస్తున్నారు. పదవ తరగతి పేపర్ లీకేజీలు చేసుకుంటూ ప్రభుత్వంపై బురదజల్లె ప్రయత్నం మానుకోవాలి. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాతనే సమూల మార్పులు వచ్చాయి. విద్యార్థుల తొలిమెట్టుపై జరుగుతున్న నీచబుద్ధిని తీవ్రంగా ఖండిస్తున్న.
– సాయిరాం, జవహర్‌నగర్
రాజకీయాల కోసం పేపర్ లీకేజీలు
పదవ తరగతి ప్రశ్నపత్రాలను లీకేజీ చేసిన వారు ఎంతటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. విద్యార్థులు పరీక్షల కోసం అనేక రోజుల నుంచి కష్టపడి చదువుతుంటే రాజకీయాల కోసం పేపర్ లీకేజీలు చేయడం సరికాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు.
-సంధ్య, ఎస్ఎఫ్సీనగర్
ఇది మంచి పద్ధతి కాదు
రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులను తమ స్వార్థం కోసం చేసే కుట్రలతో అన్యాయం చేయవద్దు. ఇలాంటి పేపర్ లీకేజీ ఘటనలతో విద్యార్థులలో మనోసైర్థ్యం దెబ్బతింటుంది. ఇది మంచి పద్ధతి కాదు. పేపర్ లీకేజీలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
– పందిరి శశికళ, ఘట్కేసర్