రవీంద్రభారతి, జూన్ 28 : దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప జాతి నిర్మాత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీమానస ఆర్ట్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో భారత పూర్వ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా కవిసమ్మేళనం, పీవీ స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య ఇనాక్ హాజరై పురస్కార గ్రహీతలకు పీవీ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. పురస్కారాలు అందుకున్న వారు కపిల లక్ష్మణరావు, టీవీ స్వామి, పి.రెడ్డమ్మ, జక్కుల వెంకటేశ్, పి.ఐశ్వర్య, అలూరి విల్సన్, ఎస్.ఇందిర, శోభారాణి సోమశంకర్ తదితరులు పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మానస ఆర్ట్స్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి కవి రఘుశ్రీ, హాస్య బ్రహ్మ శంకర్నారాయణ తదితరులు పాల్గొన్నారు.