సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): ముప్ఫై ఏళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నమ్మినవారిని రూ.50 కోట్ల వరకు నట్టేట ముంచి పరారీలో ఉన్న పబ్బ చంద్రశేఖర్ ఆచూకీ వారం రోజులైనా దొరకకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి గాలింపులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుండటంతో.. ఇదే అదునుగా విదేశాలకు ఎమైనా పరారయ్యాడా? అనే అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి.
వివరాలు.. కుషాయిగూడలోని చక్రపురం, భగవాన్ కాలనీకి చెందిన పబ్బ చంద్రశేఖర్ స్థానికంగా శ్రీవెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేస్తూ, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ స్థానికంగా ఉన్నవారితో పాటు తన సామాజిక వర్గంతో నమ్మకంగా ఉండేవాడు. ఈ పరిచయంతో వివిధ కారణాలు చెబుతూ పలువురి వద్ద నుంచి భారీ ఎత్తున వసూలు చేశాడు.
ఇలా ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద మొత్తంగా రూ.50 కోట్ల వరకు వసూలు చేసి పక్కా ప్లాన్‌తో ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితులు గత నెల 30వ తేదీన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా పబ్బ శేఖర్ ఆచూకీ లభించకపోవడంపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని వెంటనే పట్టుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.