హిమాయత్‌నగర్,మే 20 : ప్రముఖ సంఘ సంస్కర్త, దళితజాతి విద్యావికాసం కోసం కృషి చేసిన మాదరి భాగ్యరెడ్డి వర్మ138వ జయంతి వేడుకలను ఈనెల 22న రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆది- హిందూ సోషల్ సర్వీస్ లీగ్ కార్యనిర్వహక అధ్యక్షుడు పి.బాలనరసింహ, మేనేజింగ్ ట్రస్టీ ప్రతినిధి బి.ఎన్.జ్ఞానప్రకాష్, ఉపాధ్యక్షులు డి.బాల నరసింహ, బి.సత్యనారా యణరావు తెలిపారు. ఆ ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో జరిగింది.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మహా ఉద్యమ నేత భాగ్యరెడ్డి వర్మ జీవితమంతా దళితుల అభ్యున్నతికి కృషి చేశారని, జోగిని, దేవదాసి వంటి దురా చారాలను రూపుమాపేందుకు ఉద్యమించారని వారు గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ విగ్రహాంను ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఆయన ఆకాంక్షించిన సమ సమాజ స్థాపన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందన్నారు. భాగ్యరెడ్డి వర్మ స్మారక జీవిత సాఫల్య పురస్కారం-2026ను ప్రముఖ సంఘ సేవకుడు పి.ఎస్.అనంత్ రాజ్‌కు ప్రధానోత్సవం చేయనున్నట్లు వారు చేప్పారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ జి.ప్రసాద్ కుమార్,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో లీగ్ గౌరవ కార్యదర్శి మాదరి అజయ్ గౌతమ్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ కెఆర్.ఘన్‌శ్యామ్ పాల్గొన్నారు.