అంబర్పేట, నవంబర్ 19: నల్లకుంట ఫీవర్ దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది ఉద్యోగం మానేసే పరిస్థితులు దాపురించాయి. వివిధ విభాగాల్లో మొత్తం 78 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఏడాది జూలై వరకు వారికి జీతాలు ఇచ్చారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదు. ప్రతి మూడు నెలలకోసారి ఒక నెల ఇచ్చి మిగతావి పెండింగ్ పెడుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సిబ్బంది ఇబ్బందులతో ఉద్యోగం మానేశారని తెలిపారు. కాంట్రాక్టర్ను అడిగితే తమకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని, నేను ఎక్కడ నుంచి తీసుకువచ్చి ఇవ్వాలని అతడు అంటున్నాడని పేర్కొన్నారు. అధికారులను అడిగితే బిల్లులు పంపించామని, పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారన్నారు. బుధవారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్ వచ్చి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరపున ఆర్ఎంఓ డా.జయలక్ష్మితో ఈ విషయమై చర్చించారు. కాంట్రాక్టర్ను పిలిచి ఒక నెల జీతాలు ఇప్పిస్తానని ఆమె చెప్పినట్లు వారు తెలిపారు.