సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డుపై నార్సింగి వద్ద చేపట్టిన ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా అదనపు రోడ్ల నిర్మాణం పనులు చేపట్టింది. ఇందులో భాగంగా మెహిదీపట్నం-శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఉన్న నార్సింగి వద్ద ఔటర్ రింగు రోడ్డుపైకి వెళ్లేందుకు, దిగేందుకు ర్యాంపులు లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతేడాది హెచ్ఎండీఏ అధికారులు నార్సింగి ఇంటర్ఛేంజ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నార్సింగి వద్ద ఔటర్ రింగు రోడ్డు మూసీనది మీదుగా ఉండడంతో దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధ్దం చేసి నిర్మాణం చేపట్టారు.