సిటీబ్యూరో, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పూర్తి స్థాయిలో దేదీప్యమానం కానుంది. గచ్చిబౌలి-శంషాబాద్ వరకు 22 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ వెలుగులను నింపిన అధికారులు, మిగిలిన 136 కిలోమీటర్ల రహదారిని జిగేల్మనించేలా ఏడాది కాలంగా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం పనులన్నీ పూర్తి కావడంతో అన్ని రకాలుగా పరీక్షించి, అధికారికంగా ఈ నెలలోనే ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్పై ఎల్ఈడీ లైట్ల నిర్వహణ అదే స్థాయిలో ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 158 కి.మీ. మొత్తం ఓఆర్ఆర్లో ఇప్పటికే 22 కి.మీ గచ్చిబౌలి-శంషాబాద్ వరకు ఉన్న మార్గాన్ని మినహాయించి, మిగతా మార్గాన్ని (136 కి.మీ) 4 ప్యాకేజీలుగా విభజించి రూ. 102.7 కోట్లతో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించి, పనులను అప్పగించారు. దీంతో కాంట్రాక్టు పొందిన సంస్థలు ఓఆర్ఆర్ చుట్టూ పూర్తి స్థాయిలో ఎల్ఈడీ లైట్లను బిగించాయి. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు కేంద్రంగా మారింది.
దీంతో రవాణా పరంగా మెరుగైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ఔటర్‌పై పగలు, రాత్రి వేళలో ప్రయాణం సాఫీగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆర్వింద్‌కుమార్ ఔటర్ రింగు రోడ్డుపై పరిశుభ్రత కోసం 4 అత్యాధునిక స్వీపింగ్ మోటారు వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్పై ఎల్ఈడీ ప్రాజెక్టు పూర్తయిందని, త్వరలోనే 360 డిగ్రీల్లో ఓఆర్ఆర్ అంతా వెలుగుల వలయంగా మారుతుందని పేర్కొన్నారు.
ఔటర్ రింగు రోడ్డుపై ప్రతి రోజు సుమారు 1.45లక్షలకు పైగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఔటర్లో జరిగే ప్రమాదాలకు రాత్రి సమయాల్లో సరైన వెలుతురు లేకపోవడమూ కారణమని అధికారులు గుర్తించారు. ధగధగలాడే కాంతుల నడుమ ప్రయాణం ఉండాలని నిర్ణయించిన హెచ్ఎండీఏ అధికారులు పైలెట్ ప్రాజెక్టుగా గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని మొదట గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా రూ. 30కోట్ల జైకా నిధులతో ఈ 22 కి.మీ మార్గంలో 8 లేన్ల మెయిన్ కారిడార్‌లో సెంట్రల్ మీడియన్‌లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టు పనులను పిలిప్స్ కంపెనీ పూర్తి చేసి నిర్వహణ చేపట్టింది. అయితే గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో ఏర్పాటు చేసిన ఈ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో అటు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన రావడం, నిర్వహణ ఖర్చు 50శాతం మేర ఆదా కావడంతో మిగిలిన 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ వెలుగులను నింపాలని ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. దీంతో ఔటర్ మొత్తంలో సాధారణంగా కరెంట్ బిల్లుల రూపంలో దాదాపు రూ.2కోట్ల మేర ప్రతి ఏటా చెల్లించాల్సి వస్తదని, అదే ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తే ఇందులో 50 శాతం మేర ఆదా వస్తుందని అంచనాతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి విజయంతంగా పూర్తి చేశారు.
ఎన్విరాల్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ తక్కువ విద్యుత్ వినియోగం… ఇతర విద్యుత్ లైట్లతో పొల్చితే ఎల్ఈడీ లైట్లు 50శాతం విద్యుత్ ఆదా అవుతుంది. జీఎస్ఎం ఆటోమెటిక్ సిస్టం ద్వారా ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో 22 కిలోమీటర్ల మార్గంలో రూ. 15.45 లక్షలు, 2,11,725 యూనిట్ల విద్యుత్ ఆదా.
వాహన రద్దీ లేని సమయంలో ఆటోమేటిక్‌గా ఎల్ఈడీ డిమ్మింగ్ స్థాయికి మారిపోవడం ఈ విధానం ప్రత్యేకత. దీంతో సాధారణం కంటే ఎంతో విద్యుత్ పొదుపు అవుతుంది.
జంక్షన్ బాక్సులు అక్రమంగా తెరచి ఎవరైనా విద్యుత్ వాడుకుంటే ఆ సమచారం తక్షణం సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) రూపంలో సంబంధిత సిబ్బందికి చేరేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందే సిబ్బంది మొబైల్ నంబర్లు ఫీడ్ చేస్తారు. బాక్సులు ధ్వంసం చేసినా టాంపరింగ్ చేసినా ఇదే విధానంలో సమాచారం చేరుతుంది. మొత్తం దీపాల నిర్వహణ ఆన్లైన్లో సాగుతుంది. ఇంట్లో ఉండి కూడా అధికారులు పరిశీలించవచ్చు. లైట్లు వెలిగాయా? ఆపేసి ఉన్నాయా? అనే విషయం అధికారులకు తెలిసిపోతుంది. డిజిటల్ మ్యాప్ ద్వారా ఈ వివరాలు ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.