ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ద్రోహుల విగ్రహాలు కూలగొడుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హెచ్చరించారు. తెలంగాణ సాంస్కృతిక, జానపద కళలకు కేంద్రమైన రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆంధ్రప్రాంతం వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాళణ ప్రాంత విముక్తి కోసం జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించి, పోరాడిన మేధావులు, కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఎందుకు ప్రతిష్టించడంలేదో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. వారి చరిత్రను స్మరించుకుంటూ, వారి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ ప్రాంత వనరులను దోచుకున్న ఆంధ్ర ప్రాంత దోపిడీదారుల విగ్రహాలను ఏర్పాటు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రవీంద్రభారతి ఆవరణలో గద్దర్, అందెశ్రీ, గూడ అంజయ్య, సంగంరెడ్డి సత్యనారాయణ, శ్రీకాంతాచారి, బెల్లి లలిత, ప్రభాకర్‌రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా కాకుండా రవీంద్రభారతిలో ఇతరుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో మిలియన్ మార్చ్ మాదిరిగా ఓయూ విద్యర్థులు మార్చ్ నిర్వహించి ద్రోహుల విగ్రహాలు కూలుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మళ్లీ ఆధిపత్యం వహించేందుకు, తెలంగాణను దోచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయడం ద్రోహమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పల్లె ఆంజనేయులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మహేశ్‌గౌడ్, మీసాల మహేశ్, నూకల మధు, చిందం మధు, అశ్వన్, నరేశ్‌గౌడ్, కంబాలపల్లి మహేష్, నగేష్, శివ, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.