సిటీబ్యూర్, ఆగస్టు 6: ఉస్మానియా యూనివర్సిలో మద్యం సేవిస్తూ ఎనిమిది మంది పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేసు వివరాలు వెల్లడిస్తూ ఓయూ ఏసీపీ గ్యార జగన్ చేసిన వ్యాఖ్యలు క్యాంపస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేసు వివరాలు వెల్లడిస్తూ యూనివర్సిటీలో ఏం చేయాలో, ఏం చేయకూడదో వ్యాఖ్యానించడం సరికాదని విద్యార్థులు చర్చించుకుంటున్నారు.
పోలీసులు అత్యుత్సాహంతో సూడో వైస్ చాన్సలర్లా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వర్సిటీకి స్వయంప్రతిపత్తి ఉంటుందని, వర్సిటీ వ్యవహారాల్లో పోలీసులు ఎందుకు తలదూరుస్తున్నారని మండిపడుతున్నారు. వర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలా? వద్దా?అనేది యూనివర్సిటీ అధికారుల నిర్ణయమని స్పష్టం చేస్తున్నారు. నాన్ బోర్డర్ల అంశం సైతం వర్సిటీ అధికారులే చూసుకుంటారని పేర్కొంటున్నారు.
ఏసీపీ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
ఒక విన్నపం ఏంటంటే ఇది ఒక క్యాంపస్. చదువుల నిలయం. దీనిని నాన్ బోర్డర్స్ పొలిటికలైజ్ చేసి, మిగతావారు పిక్నిక్ స్పాట్‌గా చేశారు. సాయంత్రం అయితే ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విపరీతంగా బర్త్‌డే కేక్‌లు కోయడం, చాలా మంది కుటుంబాలతో సహా వచ్చి కూర్చోవడం, కొంత మంది ప్రేమ జంటలు వచ్చి అక్కడున్న వారిని డిస్టర్బ్ చేయడం, ల్యాండ్ స్కేప్ గార్డెన్లో చాలా మంది కూర్చోవడం, సాయంత్రం చాలా మంది అక్కడికి వచ్చి పంచాయితీలు మాట్లాడుకోవడం చేస్తున్నారు.
నాన్ బోర్డర్లు చాలా మంది ఓయూ లీడర్లులా చెలామణీ అవుతున్నారు. పాత, అంతకు ముందు ఉన్న విద్యార్థి నాయకులు ఇప్పటికీ క్యాంపస్‌ను వదలడం లేదు. క్యాంపస్‌ను వదిలితే మాకు ఉపాధి లేదన్నట్లు మాజీ నాయకులు ఇప్పటికీ క్యాంపస్‌ను పట్టుకుని వేలాడుతూ, నిజంగా చదువుకునే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బయట పంచాయితీలు, బయట సెటిల్ చేసుకోవాల్సిన వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు.
ఇంతకు ముందు కూడా ల్యాండ్‌స్కేప్ గార్డెన్లో బుడగ జంగాల పంచాయితీని చేస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సైతం ల్యాండ్‌స్కేప్ గార్డెన్లో కూర్చుని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. కొంత మంది పొలిటికల్ ఆర్గనైజేషన్లకు చెందిన క్యాంపస్‌ను వదిలేసి పోయిన పాత విద్యార్థి నాయకులు ఇక్కడికి వచ్చి తాము మాజీ విద్యార్థులమని, ప్రస్తుతం చదువుకుంటున్న వారిని తీసుకువచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయడం, సభలు నిర్వహించుకోవడం, క్యాంపస్‌ను ఒక ధర్నా చౌక్‌గా.. పిక్నిక్ స్పాట్‌గా మార్చారు.
దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం. క్యాంపస్ అనేది చదువుల నిలయం, చదువుల తల్లిగా చూడాలని అందరినీ కోరుతున్నా. ఇది ఒక పొలిటికల్ అడ్డా కాదు. ధర్నా చౌక్ కాదు. పిక్నిక్ స్పాట్ కాదు. ఇది అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఒక్కరు కూడా రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకుని నిజంగా చదువుకునే విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉస్మానియా యాజమాన్యానికి సైతం విజ్ఞప్తి చేస్తున్నా. నాన్‌బోర్డర్ల విషయం, ల్యాండ్‌స్కేప్‌లో బయటి వారు వచ్చి మాట్లాడుకోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
క్యాంపస్‌ను ఒక క్లోజ్డ్ క్యాంపస్‌గా తీర్చిదిద్ది, చదువుల నిలయంగా మార్చాలని కోరుతున్నా. దీనికి మీ అందరి సహకారాన్ని కోరుతున్నా. పోలీసు విభాగం తరపున శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్యాంపస్‌ను చదువుల నిలయంగా మార్చాలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయ వేదికలు, ధర్నాలు చేయకుండా చూస్తాం. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు సమస్య ఉంటే, వాటిని అర్థం చేసుకుని అధికారులతో మాట్లాడుతాం. గతంలోనూ ఇది చేశాం. అధికారులను కలిపించి, వారి సమస్యలు పరిష్కరింపజేశాం. నాన్ బోర్డర్లు, రాజకీయరాజకీయ సంఘాలు క్యాంపస్‌ను డిస్టర్బ్ చేస్తే ఊరుకునేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.