ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 27: ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులుబాసిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు హాజరై మాట్లాడారు. విద్య, పరిశోధనా రంగాల్లో ఓయూ మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ఆధునిక తెలంగాణ రూపకల్పనలో ఓయూ పాత్ర కీలకమైందన్నారు.
గౌరవ అతిథిగా హాజరైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఓయూ విద్యార్థులు సమగ్ర ప్రతిభకు పర్యాయపదంగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. తన తాత దూరదృష్టి పట్ల ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ మనవడు నవాబ్ మీర్ నజాఫ్ అలీఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. నిజాం వారసుడిగా ఉస్మానియా విజయాలను చూసి గర్విస్తున్నానని అన్నారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. 1966లో ఏర్పాటైన కొఠారి కమిషన్ విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ, నేటికీ ఈ కేటాయింపులు నాలుగు శాతానికి మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ, ఐఏఎస్ అధికారి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ లావణ్య, విద్యార్థి వ్యహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, కార్యక్రమ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కొండానాగేశ్వర్ రావు, ఇతర సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, డీన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆవిర్భావ దినోత్సవాన అంధకారంలో ఆర్ట్స్ కళాశాల
ఓయూ 108వ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించిన అధికారులు ప్ర ఖ్యాత ఆర్ట్స్ కళాశాల,సెంటినరీ పైలాన్లను అంధకారంలో ఉంచారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కింద సుమారు 15 కోట్లతో ఆర్ట్స్ కళాశాలకు లైటింగ్, ఇతర ఏర్పాట్లు చేసినప్పటికీ కనీసం ఆవిర్భావం నాడు వినియోగించుకోకపోవడం గమనార్హం. అధికారుల తీరుపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.