అధికార పార్టీ నాయకులు, పోలీసులు మిలాఖత్ అయ్యారు. డబ్బున్న వారిని టార్గెట్ చేసి మామూళ్ల కోసం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఏసీపీ, సీఐలతో పాటు ఠాణా సిబ్బంది ముగ్గురు అన్నదమ్ములపై దాడి చేసి.. పోలీస్ వ్యవస్థ పరువును బజారుకిడ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో విచారణకు ఆదేశించారు.
– సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ
తార్నాకలో నివాసముండే సందీప్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, శివరాంరెడ్డి సోదరులు. తార్నాకలో తమకు ఉన్న స్థలంలో స్పోర్ట్స్ స్కేర్ గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారు. దాని పక్కనే మరికొంత స్థలం వీళ్లకు ఉంది. ఈ క్రమంలో వీరికి గేమింగ్ జోన్‌తో మంచి ఆదాయం వస్తున్నదని, తనను కూడా చూసుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త మామూళ్లకు కక్కుర్తి పడ్డాడు. తాము ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిజాయితీగా సంపాదించుకుంటున్నామంటూ చెప్పారు.
అధికార పార్టీకి చెందిన తనకు అన్నదమ్ములు లొంగడం లేదని, సదరు నాయకుడు పోలీసులను రంగంలోకి దింపాడు. ఈ క్రమంలో గురువారం గేమింగ్ జోన్ వద్ద ఉన్న సందీప్‌రెడ్డిని పెట్రోలింగ్ పోలీసులు కలిశారు. ‘మా సార్ పిలుస్తున్నాడు.. నీవు వెంటనే మాతో రావాలం’టూ హుకుం జారీ చేశారు.
తన భార్య కారులో ఉందని, ఆమె గర్భవతి అని ఆమెను ఇంటి వద్ద దించి, తానే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ ఆయన పోలీసులను కోరాడు. ‘తమషాలు చేస్తున్నావా..! మా సార్ పిలిస్తే రావా? ’ అంటూ పెట్రోలింగ్ పోలీసులు సీరియస్ అయ్యారు. ‘సార్ నేను నా భార్యను ఇంటి వద్ద దింపేసి వెంటనే వస్తానం’టూ ప్రాధేయపడ్డాడు. ‘లేదు… మేం నీతోనే వస్తామం’టూ సందీప్‌రెడ్డి కారు వెంట పెట్రోలింగ్ వాహనం వెళ్లింది. ఇంటి వద్దకు వెళ్లగానే సందీప్‌రెడ్డి తన భార్యను దింపేశాడు. తరువాత తన కారులో వస్తానంటే.. ‘లేదు.. మా కారులో కూర్చోమం’టూ పెట్రోలింగ్ వాహనంలో అతడితో పాటు అతడి సోదరులు సంతోష్‌రెడ్డి, శివారాంరెడ్డిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రాజేందర్ వద్దకు సోదరులు వెళ్లారు. ‘సార్ మమ్మల్ని ఎందుకు పిలిపించారు.. మాపై ఏదైనా ఫిర్యాదు ఉందా? కేసులు ఏమైనా ఉన్నాయా?’ అంటూ అడిగారు. ‘ఏమి రా..! మేం పోలీస్‌స్టేషన్‌కు పిలిస్తే మీరు రారా..! ఏమనుకుంటున్నార్రా..! మీరు పెద్ద తోపులనుకుంటున్నారా? కూర్చోండం’టూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ‘ఇదేం అన్యాయం సార్’ అనగానే ‘నన్నే మీరు ప్రశ్నిస్తరా.. అంటూ బూతు పురాణం అందుకున్నాడు. సందీప్‌రెడ్డి గల్లా పట్టుకొని… పోలీసులంటే ఏమనుకుంటున్నావంటూ చేయి చేసుకున్నాడు.
అక్కడున్న సిబ్బంది సైతం ఆ ముగ్గురు అన్నదమ్ములను పై అంతస్తులోకి లాక్కొని వెళ్లి చితకబాదారు. విషయం తెలుసుకున్న ఏసీపీ అక్కడకు చేరుకొని ఏమనుకుంటున్నారా..! మీకు చాలా ఎక్కువైంది.. నా కొడుకుల్లారా’ అంటూ ఆయన కూడా తన సిబ్బందికే సపోర్టు చేస్తూ మాట్లాడడని బాధితులు ఆరోపించారు. బాధితుల మామ శ్రీనివాస్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకొని పోలీసుల అన్యాయాన్ని ప్రశ్నించాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లాడు. అదనపు డీసీపీ నర్సయ్య రంగంలోకి దిగారు. అయితే అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో తమపైనే సందీప్‌రెడ్డి దాడికి యత్నించాడంటూ పోలీసులు విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అదనపు డీసీపీ బాధితులతో మాట్లాడి ఏదో జరిగింది… విషయం వదిలేయండంటూ వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు.
ఇన్స్పెక్టర్కు బాధితుల ముందే అదనపు డీసీపీ ఫోన్ చేసి, బాధితులపై ఎవరూ ఫిర్యాదు చేశారు.. ఎందుకు వాళ్లను తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు. సార్.. ఫలాన సార్ ఫోన్లో గేమింగ్ జోన్ వద్ద న్యూసెన్స్ అవుతుందంటూ మౌఖికంగా ఫిర్యాదు చేశారని, అందుకే వాళ్లను స్టేషన్‌కు పిలిపించామంటూ చెప్పాడు. దీంతో బాధితులను అదనపు డీసీపీ కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఓయు ఠాణాలో ఎలాంటి ఘటన జరుగలేదంటూ ..సమస్య బయటకు రాకుండా తన వంతు ప్రయత్నం చేశారు. సీపీ ఈ ఘటనపై దర్యాప్తు జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారని బాధితులు వెల్లడించారు. శుక్రవారం సీఎం, డీజీపీలకు ఫిర్యాదులు చేస్తామని, అన్యాయంగా తమపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు. 15 మంది పోలీసులు రక్తం కారేలా.. తమపై విచక్షణ రహితంగా దాడి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.