ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 4: ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్ని మీట్ బుధవారంతో ముగిసింది. ఎక్కడెక్కడో స్థిరపడిన ఓయూ పూర్వ విద్యార్థులు తిరిగి ఒకచోట కలిశారు. సమావేశాల్లో రెండో రోజు ఓయూ క్యాంపస్ కళాశాలలు, ఆయా విభాగాలు పూర్వ విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేశాయి.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఓయూలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థిగా తాము ఉన్న హాస్టళ్లను సందర్శించి, మెస్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఆర్ట్స్ కళాశాలలోని తెలుగు విభాగంలో జరిగిన సమావేశానికి సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ హాజరయ్యారు. జర్నలిజం విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హెచ్‌సీడీసీ రూపొందించిన న్యూస్ లెటర్‌ను ఆవిష్కరించారు. మైక్రోబయాలజీ విభాగంలో జరిగిన సమావేశానికి మెదక్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ డాక్టర్ హరీశ్‌రెడ్డి, మాజీ ప్రొఫెసర్లు హాజరయ్యారు.
సమావేశాలు జరుగుతున్న ప్రతీ కళాశాల, విభాగాలకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెళ్లి పూర్వ విద్యార్థులను పలకరించారు. ఓయూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులను కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని తెలిపారు.
విరాళాలు అందజేసిన ప్రముఖులు..
కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, పలువురు విశ్రాంత అధ్యాపకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఐజీ నర్సింహ రూ.లక్షా25 వేలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు రూ.లక్ష, పీజీ బ్లాక్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు రూ.5 లక్షలు, సీనియర్ న్యాయవాది వెంకట్‌రెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఇంగ్లిష్ విభాగంలో జరిగిన సమావేశానికి హాజరైన ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఈ.సురేశ్‌కుమార్ రూ.లక్ష విరాళంగా అందజేశారు.