వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓయూ దూరవిద్యా కేంద్రమైన పీజీఆర్ఆర్సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ పరీక్షలు ఈ నెల 21నుంచి, ఎంపీఈడీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు చూసుకోవచ్చని సూచించారు.
ఎంఈ, ఎంటెక్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తుల స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. మార్కు మెమోలను సంబంధిత కళాశాలల నుంచి రెండు వారాల తరువాత పొందవచ్చని పేర్కొన్నారు.
రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు టీఎస్ ఆన్లైన్ కేంద్రాలలో ఈ నెల 16వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత రుసుము చెల్లించాలని సూచించారు. జవాబు పత్రం నకలు పొందగోరే వారు ఈ నెల 16వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.
వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, రెండో, మూడో, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును, ఎంఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, రెండో, మూడో, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 16 లోగా, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 21లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు చూసుకోవచ్చని సూచించారు.