సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్: ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖాన మరో రికార్డు సృష్టించింది. ఉస్మానియా వైద్యులు కేవలం 30 రోజుల్లో 5 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా జరిపి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. నెలరోజుల కాల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపిన దాఖలాలు దేశంలోని ప్రభుత్వ రంగ దవాఖానల్లో ఎక్కడ లేదని, ప్రభుత్వ రంగ దవాఖానలో తొలిసారిగా 30 రోజుల్లో ఐదు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపిన ఘనత ఉస్మానియాకే దక్కిందని వైద్యాధికారులు చెప్పారు. ఈ మేరకు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సాహెతో కలిసి సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డా.మధుసూదన్ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెంకు చెందిన జోసోబు, పూజిత వృత్తి రీత్యా దినసరి కూలీలు. వీరిది మేనరిక వివాహం.
ఈ దంపతుల మొదటి సంతానం టైరోసినిమియా టైప్ -1 డిసీజ్ కారణంగా 4 నెలల వయస్సులోనే మృతిచెందాడు. వీరి రెండో సంతానమైన అజిత్‌కుమార్(2) సైతం టైరోసినిమియా టైప్ 1 డిసీజ్ తో బాధపడతున్నాడు. దీని కారణంగా కాలేయ క్యాన్సర్, క్రానిక్ లివర్ డిసీజ్‌కు గురయ్యాడు. దీంతో బాలుడి కాలేయం విఫలమైంది. బాలుడి పరిస్థితి రోజురోజుకు విషమించడంతో తల్లిదండ్రులు నగరంలోని పలు కార్పొరేట్ దవాఖానలకు తిరిగారు. అయితే ఈ సర్జరీకి ప్రైవేట్ హాస్పిటల్లో రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చవుతుందని అక్కడి ప్రైవేటు దవాఖాన వారు చెప్పడంతో అంత ఆర్థిక స్థోమత లేని బాధిత కుటుంబం ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డా.మధుసూదన్‌ను సంప్రదించారు. టైరోసినిమియా కారణంగా బాలుడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని నిర్ధారించి, వెంటనే కాలేయ మార్పడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.30లక్షల నుంచి రూ.40లక్షల ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను పైసా ఖర్చు లేకుండా లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను ఉచితంగా జరిపారు. ఈ సర్జరీలో రోగికి అతడి అమ్మమ్మ కాలేయంలో నుంచి కొంత భాగాన్ని తీసి బాలుడికి మార్పిడి చేసినట్లు డా.మధుసూదన్ వివరించారు.
జన్యుపరమైన వ్యాధి కారణంగా..
సూర్య పేట జిల్లా, రాణి గూడెం ప్రాంతానికి చెందిన వీరస్వామి, నాగజ్యోతి దంపతుల కుమారుడు సాథ్విక్ గౌడ్(7) విల్సన్స్ అనే జన్యుపరమైన వ్యాధి కారణంగా డీ-కంపెన్సేషన్తో ఏర్పడే క్రానిక్ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నాడు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో రాగి అంటే కాపర్ ఉంటుంది. దీనిని కాలేయంలో ఉండే సెరలోప్లాసిస్ అనే పదార్థం కాపర్‌ను గ్రహించి మలం ద్వారా బయటకు పంపిస్తుంది. అయితే విల్సన్ రుగ్మత గల రోగుల్లో సెరలోప్లాసిస్ లోపం వల్ల ఈ కాపర్ అనేది బయటకు పోకుండా కాలేయం, మెదడులో పేరుకుపోతున్నది. ఇది సిర్రోసిస్, వణుకు, వికృతమైన నడక, కళ్లో కేఎఫ్ రింగ్‌లు, హేమోలిటిక్ రక్తహీనతకు కారణమవుతుంది. కాలేయం విఫలమవుతుంది. విల్సన్ రుగ్మత కారణంగా సాథ్విక్ కాలేయం విఫలమైంది. బాలుడి కుటుంబ సభ్యులు నగరంలోని పలు ప్రైవేటు దవాఖానలను సంప్రదించగా అక్కడ రూ.30 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేని కుటుంబ సభ్యులు బాలుడిని ఉస్మానియాకు తీసుకువచ్చారు.
వైద్యపరీక్షలు జరిపిన వైద్య బృందం బాలుడికి కాలేయ మార్పిడికి ఏర్పాట్లు చేశారు.ఇందులో భాగంగా రోగి తల్లి నాగజ్యోతి కాలేయం ఎడమ భాగం నుంచి కొంత భాగాన్ని తీసి బాలుడికి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ జరిపారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా, ఎడిగోనపల్లికి చెందిన వెంకటేశ్(20) విల్సన్ రుగ్మత కారణంగా సిరోసిస్‌తో బాధపడుతున్నాడు. హన్మకొండ ప్రాంతానికి చెందిన ఎం.హర్షప్రియ న్యూరో విల్సన్ రుగ్మతతో బాధపడుతున్నది. ఈ రోగులిద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఆర్థిక స్థోమత లేక ఉస్మానియాను ఆశ్రయించారు. ఈ మేరకు రోగులకు వైద్యపరీక్షలు జరిపించిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌కు గురైన ఇద్దరు వేర్వేరు జీవన్మృతుల కాలేయాలను సేకరించి కడావర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించారు.
అరుదైన వ్యాధితో..
యాదాద్రి జిల్లా, బ్రాహ్మణపల్లికి చెందిన ఎం.వెంకటేశ్(40) అరుదైన బడ్ చైరి సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఇది ప్రొటీన్-సీ, ప్రొటీన్-ఎస్ లోపం వల్ల వచ్చే జనటిక్ వ్యాధి. దీని కారణంగా ఇతడి కాలేయం విఫలమవ్వడంతో కాలేయ మార్పిడి తప్పనిసరైంది. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్ చికిత్స కోసం ఉస్మానియాను ఆశ్రయించగా వైద్యపరీక్షలు జరిపన వైద్యులు.. రోగికి కడావర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ జరిపారు. కేవలం 30రోజుల వ్యవధిలో ఈ ఐదుమంది రోగులకు జరిపిన కాలేయ మార్పిడిలన్నీ విజయవంతమయ్యాయని, వీటి ఖరీదు ప్రైవేటు దవాఖానల్లో రూ.1.5కోట్ల వరకు ఉంటుందని వైద్యులు తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి ప్రొఫెసర్ మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అరుదైన శస్త్ర చికిత్సల్లో ప్రొఫెసర్లు అభిమన్యు, ఉమాదేవి, రమేశ్‌కుమార్, విజయ్‌శంకర్, వైద్యులు లక్ష్మీనారాయణ, సునీల్, మానస, భావన, కావ్య, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.