ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 27: ‘విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఆరోగ్యం, సంతోషాల విషయంలో రాజీపడొద్దు. సవాళ్లు ఎదుర్కొన్నప్పుడే విజయం తథ్యం. చిన్నచిన్న ఆటుపోట్లకు కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కణలు చేపట్టాలి. దేశ పురోభివృద్ధిలో ఇవి అవశ్యం. అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవం రెండేండ్ల విరామం తర్వాత బుధవారం వర్సిటీ ప్రాంగణంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చాన్సలర్ హోదాలో గవర్నర్‌తోపాటు ముఖ్యఅతిథిగా డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి హాజరయ్యారు.
తొలుత 2018-2019, 2019-2020 విద్యాసంవత్సరాలకు సంబంధించి 35 స్వర్ణ పతకాలు, 319 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. గవర్నర్ బంగారు పతకాలు ఇచ్చి వెళ్లిపోగా, పీహెచ్డీ పట్టాలు కూడా ఆమె చేతులు మీదుగా తీసుకోవాలని ఆశించి నిరాశ చెందారు. వీరందరికీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి పీహెచ్డీ పట్టాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవడం చాలా ఆనందంగా ఉన్నదని, దేశంలో ఓయూ సమున్నత స్థానాన్ని కలిగి ఉందన్నారు.
1986 నుంచి ఓయూతో తనకు అనుబంధం ఉందని, పరిశోధనల నిమిత్తం వర్సిటీలోని నావిగేషన్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్ (ఎన్‌ఈఆర్‌టీయూ)కు క్రమం తప్పకుండా వచ్చేవాడినని చెప్పారు. అంతకుముందు వివిధ విభాగాల డీన్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం లాంచనంగా జరిగింది. పట్టాలు, పతకాలు పొందనున్న విద్యార్థులచే వర్సిటీ సంప్రదాయం ప్రకారం వీసీ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, పీఆర్వో డాక్టర్ సుజాత, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.
తెలుగు విభాగంలో రమిశెట్టి కావ్యకు బంగారు పతకంతో పతకాల ప్రదానోత్సవం ప్రారంభం కాగా, వందేళ్ల వర్సిటీ చరిత్రలో తొలిసారి అయిదు బంగారు పతకాలు సాధించి సాయబుగారి సుశాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బంగారు పతకాలు, పట్టాలు అందుకున్న వారు తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందం పంచుకున్నారు. ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడిపారు.
స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ రమేశ్‌రెడ్డి, ఏసీపీ ఆకుల శ్రీనివాస్, సీఐ రమేశ్నాయక్లు స్వయంగా పర్యవేక్షించారు.
వందేండ్ల ఓయూ చరిత్రలో తొలిసారి ఐదు బంగారు పతకాలు సాధించడం గర్వంగా ఉంది. మాది కామారెడ్డి జిల్లా బిక్కునూర్ మండలం కాచాపురం గ్రామం. 2019లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాను. ఓయూలో పరిశోధన చేసి, నూతన డ్రగ్‌లను రూపకల్పన చేయాలనుకుంటున్నా. ప్రకృతి సిద్ధమైన వస్తువుల నుంచి వాటిని ఉత్పత్తి చేయాలనుకుంటున్నా. ఇప్పటికే ఓయూలో ప్రాథమికంగా పీహెచ్డీ ప్రవేశం తీసుకున్నా. – సాయబుగారి సుశాంత్