సిటీబ్యూరో, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): ఓయూ డిగ్రీ సెమిస్టర్-1 పరీక్ష ఫలితాలలో బాలికలు పై చేయి సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలు 22,649 మంది, బాలురు 12,900 మంది ఉన్నారు. బాలికల ఉత్తీర్ణత 52.59 శాతం ఉండగా, బాలురు ఉత్తీర్ణత శాతం 27.07గా నమోదైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నిర్వహించిన యూజీ (సీబీసీఎస్) సెమిస్టర్-1 (రెగ్యులర్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసింది.
బీఏ/ బీఎస్డబ్లూ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులలో పరీక్షలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫలితాలు ఓయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. విడుదలైన ఓయూ డిగ్రీ ఫలితాలలో 39.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ నాలుగు రకాల కోర్సుల కోసం మొత్తం 90,362 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 35,549 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఓయూ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.