ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యారంగానికి కలికితురాయి వంటి ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి తన ఘనతను నిరూపించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వర్సిటీకి చెందిన అయిదుగురు ప్రొఫెసర్లను వరించారు. కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అప్పారావు, లా విభాగానికి చెందిన ప్రొఫెసర్ జీబీ రెడ్డి, మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ హమీదా బీ, ఎకనామిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ మాధురి స్మిత, ఇంగ్లిష్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కరుణాకర్ ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు అభినందించారు. ప్రొఫెసర్ అప్పారావు ప్రస్తుతం కామర్స్ విభాగం డీన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొఫెసర్ జీబీ రెడ్డి ప్రస్తుతం ఓయూ దూరవిద్యాకేంద్రమైన పీజీఆర్ఆర్సీడీఈ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ కార్యాలయం డైరెక్టర్, లా విభాగం హెడ్, డీన్, లీగల్ సెల్ డైరెక్టర్ తదితర బాధ్యతల్లో పనిచేశారు. ప్రొఫెసర్ కరుణాకర్ ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆయన ఓయూ ఆర్ట్స్ విభాగం డీన్, ఓయూసీఐపీ డైరెక్టర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు.