ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలలో పనిచేస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ అధ్యాపకుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో వెలువరించిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సెల్ఫ్ ఫైనాన్స్ అధ్యాపకులు మాట్లాడుతూ.. ఈ వేతనాల పెంపుతో 350 మంది అధ్యాపకులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. జీవో జారీకి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటామన్నారు. వేతనాల పెంపుతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.