‘మా హాస్టల్ గుర్తుకొస్తే చచ్చేటంత భయం.. దాని కంటే పశువుల పాక ఎంతో నయం’ ..శిథిలావస్థకు చేరిన భవనంలో పెచ్చులూడుతున్న సీలింగ్, గోడలకు ఏర్పడిన పగుళ్లు, అస్తవ్యస్తంగా విద్యుత్ తీగలు, చినుకు పడితే ఎక్కడ పైకప్పు కూలిపడిపోతుందో అనే భయం గుప్పిట్లో విద్యార్థులు హడలిపోతున్నారు. శుభ్రత పాటించాలి అని ప్రజలకు చెప్పే వైద్య విద్యార్థినులు నివాసం ఉండే ఆ హాస్టల్లో అడుగడునా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా దవాఖానలోని నర్సింగ్ కళాశాల వసతి భవనం పరిస్థితి. ఉస్మానియా నర్సింగ్ కళాశాల విద్యార్థుల వసతి గృహంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక స్టోరీ …
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): 1951లో నిర్మించిన ఉస్మానియా నర్సింగ్ కళాశాల వసతి భవనం ప్రస్తుతం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరింది. భవనంలో ఎక్కడిక్కడ పెచ్చులూడుతున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో.. ఏ మూలన పెచ్చులూడి తమ మీద పడతాయో అని నర్సింగ్ విద్యార్థినులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ చదువు కొనసాగిస్తున్నారు. నర్సింగ్ కళాశాల వసతిగృహంలో ఉన్న మూడు బ్లాకుల్లో 180 మంది జనరల్ నర్సింగ్, 50 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు ఉంటూ ఉస్మానియా
ఆస్పత్రిలో వైద్య శిక్షణ తీసుకుంటున్నారు. మూడు బ్లాకుల్లో కూడా పెచ్చులూడటం, కాలం చెల్లిన స్విచ్ బోర్డుల వైర్లు తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా హాస్టల్ గోడలపై పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది.
రోగాలబారిన విద్యార్థినులు..
హాస్టల్ వెనుక ప్రాంతంలో డ్రైనేజీ పైప్‌లు పగిలిపోవడంతో నిత్యం మురుగు నిలిచి ఉండటంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు వ్యాపించి విద్యార్థినులు రోగాలబారిన పడుతున్నారు. వైద్య శిక్షణకోసం వచ్చిన వారే రోగులుగా అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి. వసతిగృహంలోని మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయి. సమయానికి నీళ్లు రాకపోవడం, ప్రతిరోజు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పాత ఆస్పత్రిలో పాఠాలు చెప్పగా, ప్రస్తుతం అది మూసేయడం మూలంగా సూపరింటెండెంట్ గది సమీపంలోని చిన్నచిన్న తరగతి గదుల్లో బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయి శ్రద్ధ కనబరచలేకపోతున్నారు.
నిర్లక్ష్యంపై విమర్శలు..
నర్సింగ్ కళాశాల వసతిగృహం దుస్థితి గురించి అక్కడి విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలోనే పేరొందిన ఉస్మానియా ఆస్పత్రి విద్యార్థుల వసతిగృహం దుస్థితిపై ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బడుగుబలహీనవర్గాలకు చెందిన నర్సింగ్ విద్యార్థినుల కష్టాలు మంత్రికి కనిపించడం లేదా అని వారు వాపోతున్నారు. అసలే వానాకాలం ప్రారంభమైంది. వానలు దంచి కొడితే.. భవనం కూలిపోవడంతో పాటు, పాత వైరింగ్ కారణంగా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకొచ్చే ైస్టెఫండ్తోనే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్‌ను నడిపిస్తున్నా, తమ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉస్మానియా ఆస్పత్రిని.. నూతనంగా గోషామహల్లో నిర్మించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆ రునెలల క్రితం భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడి స్థానికుల వ్యతిరేకత, అది పూర్తయ్యే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరిన నర్సింగ్ కళాశాల హాస్టల్‌ను ఖాళీ చేయించి.. వేరే భవనంలోకి తమకు వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.