హైదరాబాద్: ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. అప్రమత్తమైన అధికారులు నార్సింగి వద్ద ఓఆర్ఆర్ (ORR) సర్వీస్ రోడ్డును మూసివేశారు. సర్వీస్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్‌ను మూసివేడంతో మంచిరేవుల-నార్సింగి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు.
ఉస్మాన్‌సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి 4,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1789.45 అడుగుల వద్ద ఉన్నది. అదేవిధంగా హిమాయత్‌సాగర్ జలాశయానికి 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 3 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. కాగా, ప్రస్తుతం 1762 అడుగులు నీటిమట్టం ఉన్నది.