సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): పసిపిల్లల విక్రయాల కేసులో ఇతర రాష్ర్టాలలో కీలక నిందితుల మూలాలు తెలియకుండా పోవడం ఓ మిస్టరీలా మారింది. పసిపిల్లలను విక్రయించడం..ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఇలా చేస్తూ పోలీసుల నిఘానుంచి విక్రయ ముఠాలు తప్పించుకుంటున్నాయి. అచ్చం సినిమా కథలా పసిపిల్లల విక్రయ ముఠా.. పుట్టిన పసి కందులను వేల కిలోమీటర్లు అక్రమంగా రవాణా చేస్తూ రెండు తెలుగు రాష్ర్టాలలో ఈ ముఠాలు విక్రయిస్తున్నాయి. గత ఏడాది మే నెలలో రాచకొండలోని మేడిపల్లి పోలీసులు ఇలాంటి ముఠాలో 11 మందిని అరెస్ట్ చేసి, 14 మంది పసిపిల్లలను కాపాడారు. ఈ ముఠాకు ఢిల్లీ, మహారాష్ట్రలతో సంబంధముందని తేలింది. తాజాగా చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో పిల్లల విక్రయ ముఠాను అరెస్ట్ చేశారు, పిల్లలను కొనుగోలు చేసిన దంపతులను సైతం పోలీసులు ఈ సారి అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు గుజరాత్‌తో సంబంధాలున్నట్లు వెల్లడయ్యింది.
ఇతర రాష్ర్టాలలో అల్లుకుపోయిన ఈ ముఠాల నెట్‌వర్క్‌ను ఛేదించడంలో అటూ ఆ రాష్ర్టాలకు చెందిన పోలీసులు, ఇటూ తెలంగాణ పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పిల్లలను అపహరించుకొని తీసుకొస్తున్నారా? పుట్టిన బిడ్డలను వారి తల్లిదండ్రులే స్వయంగా డబ్బుకు ఆశపడి విక్రయిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. పిల్లలు లేని వారు అక్రమ పద్దతిలో పిల్లలను కొనుగోలు చేస్తుండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. ఈ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించలేకపోవడంతో ..కాపాడిన పిల్లలను వారి సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చలేని పరిస్థితి నెలకొంది. అటువంటి పిల్లలు ఇంకా శిశువిహార్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.
రెండు రాష్ర్టాలలో గాలించినా..
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పిల్లల విక్ర య ముఠాను గత ఏడాది మేలో మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మేడిపల్లికి చెందిన శోభ, స్వప్న, షేక్ సలీమ్‌లతో పాటు పద్మ, సరోజ, శారద, షకీలా, రాజు, ముంతాజ్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ పిల్లలు ఎక్కడక్కడ విక్రయించారనే విషయాన్ని గుర్తించి విక్రయించిన 14 మంది పిల్లలను కాపాడారు. పిల్లలను రూ.5 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసిన తల్లిదండ్రులు అప్పుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ఆందోళన సైతం చేశారు. ఇదే ముఠా ముంబాయిలోను పిల్లలను విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ ముఠాపై థానే పోలీసులు కేసు నమోదు చేశారని తేలింది. ఈ ముఠా 60 మంది వరకు పిల్లలను విక్రయించిందని పోలీసుల విచారణలో తేలింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఏజెంట్ల ద్వారా పిల్లలను విక్రయించడంలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలను పట్టుకుంటే కీలక నిందితుల ఆచూకీ తెలుస్తుందని రాచకొండ పోలీసులు ప్రయత్నించారు. అయితే దళారుల ఆచూకీ తెలియకపోవడంతో మూలాల వరకు వెళ్లలేకపోయారు.
ఎంత మందిని విక్రయించారో..?
పిల్లలను ఎక్కడి నుంచి తెస్తున్నారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కేవలం తెలంగాణలోనే 8 నెలల వ్యవధిలో రెండు ముఠాలకు సంబంధించిన ఆచూకీ బయటపడింది. సోషల్‌మీడియా ద్వారా ఈ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తూ, పోలీసులకు చిక్కకుండా ఎత్తులు వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే గుజరాత్‌కు చెందిన వందన, ఢిల్లీ, పుణేలకు చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్యల లాంటి వాళ్లు తమ నెట్‌వర్క్‌ను అన్ని రాష్ర్టాలలోను నిర్వహించే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా ఈ నెట్‌వర్క్‌ను ఛేదించాలని ముందుకు సాగుతున్నారు. అయితే హైదరాబాద్‌లో ఈ ముఠా పట్టుబడగానే అప్పటి వరకు నిర్వహించిన నెట్‌వర్క్‌లోని సభ్యులందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉంటూ తిరిగి తమ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా అరెస్టయిన కృష్ణవేణికి గత ఏడాది ఢిల్లీకి చెందిన ముఠాతో సంబంధాలున్నాయి. మేడిపల్లి, చైతన్యపురి పోలీస్స్టేషన్లలో నమోదైనా పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులను ఛాలెంజ్‌గా తీసుకొని వాటి ములాలను ఛేదించేందుకు గాలింపు ముమ్మరం చేశారు. అయితే ఈ సారైనా పోలీసులు పకడ్బందీ వ్యూహాలతో ఈ ముఠాలలోని కీలక నిందితులను పట్టుకుంటారా..అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.