Playing Cards | సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు ఉక్కుపాదంతో అణిచివేసిన పేకాట క్లబ్బులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. తిరిగి పేకాట దందాలు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పురుడు పోసుకుంటుండడం ఆందోళన కలిగిస్తున్నది. కిరాయి ఇండ్లను అడ్డగా చేసుకొని బెట్టింగ్ రాయుళ్లు దందాను సాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల పోలీసులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దొంగతనాలు, బెట్టింగ్, స్నాచింగ్‌లు ఇలా అన్ని నేరాలు రాజధాని నగరంలో పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాలను ఉక్కుపాదంతో అణివేసింది. పేకాట క్లబ్బులతో సామాన్యుడు, పేద ప్రజలు ఆర్థికంగా చితికిపోయి, ఆత్మహత్యలు చేసుకొని, ఆయా కుటుంబాలు రోడ్లపైకి వచ్చిన పరిస్థితులు సైతం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉండకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. రోజంతా పనిచేస్తే వచ్చే డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకోకుండా, అసలు ఆ బెట్టింగ్ దందాలే రాష్ట్రంలో లేకుండా చేసింది. అయితే నేడు ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చేస్తున్నది. ఇబ్బడి ముబ్బడిగా మినీ పేకాట క్లబ్బులు వెలుస్తున్నాయి.
పేకాట అనేది ఇప్పుడు అన్ని వర్గాలకు విస్తరించింది. నిర్వాహకులు బస్తీలు, కాలనీలతో పాటు వ్యాపార సముదాయలుండే చోట ఇండ్లను కిరాయికి తీసుకుంటున్నారు. సౌత్‌జోన్, సౌత్‌వెస్ట్, సౌత్ఈస్ట్, మహేశ్వరం వంటి జోన్లలో ఎక్కువగా బస్తీల్లో అడ్డాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. నిర్వాహకులు బస్తీల్లో ఒకటి రెండు చోట్ల ఇండ్లను కిరాయికి తీసుకుంటూ, అక్కడ ఒక పోర్షన్ కుటుంబానికి అప్పగించి, ఆ ఇంట్లో వెనుక, పక్కలో ఉండే పోర్షన్లను పేకాట కోసం ఉపయోగస్తున్నట్లు తెలిసింది.
స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే వారు కూడా పేట క్లబ్బులకు హాజరవుతున్నట్లు సమాచారం. ఏ రోజు ఏ అడ్డాలో పేకాట మినీ క్లబ్ నిర్వహిస్తారు అనే సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్‌లో చేరవేస్తున్నట్లు తెలిసింది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని కొన్ని చోట్ల మినీ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా, అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. అయితే ఈ మినీ పేకాట క్లబ్‌ల నిర్వాహకులు దొరికితేనే దొంగ లేదంటే.. దొరగా చెలామణి అవుతుంటారని తెలిసింది. రెండు రోజుల కిందట ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మినీ పేకాట క్లబ్బులపై దాడులు నిర్వహించి.. 13 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఇక్కడ మినీ పేకాట క్లబ్బు నడుస్తున్నా.. స్థానిక పోలీసులు గుర్తించలేకపోయారనే విమర్శలొస్తున్నాయి.