మన్సురాబాద్, మార్చి 8: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను మరికొందరికి అమర్చి ప్రాణదానం చేసేందుకు జీవన్ దాన్ తెలంగాణ గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేసింది. గ్రీన్ ఛానల్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా, పడమటిపల్లె, గోకుల్ నగర్ కు చెందిన కడారి జంగయ్య(49) ఈనెల 3న ఇంట్లో ఒకసారిగా కుప్పకూలి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు.
గత ఐదు రోజులుగా ఆయనకు చికిత్స అందించినప్పటికీ కోలుకోలేదు.. శనివారం ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసినట్లయితే మరికొందరికి ప్రాణం పోయవచ్చునని జీవన్ దాన్ ప్రతినిధులు జంగయ్య కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు బ్రెయిన్ డెడ్ అయిన జంగయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో జీవన్ దాన్ ప్రతినిధులు జంగయ్య అవయవాలను ఇతర వ్యక్తులకు అమర్చేందుకు సరైన సమయంలో అపోలో ఆసుపత్రికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
గ్రీన్ ఛానల్ ద్వారా మొదట అంబులెన్సులో ఎల్బీనగర్ కామినేని నుంచి రాత్రి 8.04 గంటలకు బయలుదేరి నాగోల్ మెట్రో వద్దకు 8.12 గంటలకు చేరుకున్నారు. నాగోల్ మెట్రోలో 8.12 గంటలకు బయలుదేరి జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ కు 8.35కు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో అపోలో ఆసుపత్రికి 8.40 గంటలకు చేరుకున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను అంబులెన్స్ లో 13 నిమిషాలు.. మెట్రోలు 23 నిమిషాల ప్రయాణం సాగింది.. కామినేని నుంచి అపోలో ఆసుపత్రికి అవయవాలను చేర్చేందుకు 36 నిమిషాల సమయం పట్టింది. రెండు కిడ్నీలు, గుండె, రెండు కార్నియాలను తరలించారు. రాచకొండ పోలీసులు, మెట్రో సహకారంతో అవయవాల తరలింపు ప్రక్రియ కొనసాగింది.