సిటీబ్యూరో, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): మరో జన్మ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు..కానీ అవయదానంతో మరికొందరికి పునర్జన్మను ఇవ్వొచ్చు. ఇలాంటి మంచి కోసం ఒప్పుకొని తమ కుటుంబ సభ్యులు తమకు దూరమై మరికొన్ని కుటుంబాల్లో ఆనందాన్ని నింపడం చాలా సంతృప్తిగా ఉందని అవయవ దానం చేసిన కుటుంబసభ్యులు వారి మనోగతాన్ని వెలిబుచ్చారు. సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానాలను చేసిన పలు కుటుంబాల్లో వెలుగును నింపిన ఏడుగురి కుటుంబ సభ్యులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారిని పలకరించినప్పుడు వారిలో బాధ ఉన్నా తన కుటుంబ సభ్యుడి అవయవాలు నలుగురికి ఉపయోగపడి ఆ కుటుంబాల్లో నవ్వులు పూరిస్తుండడం ఆనందంగా ఉందన్నారు.
కొండాపూర్‌కు చెందిన శ్రీదేవి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది. జీవన్‌ధాన్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అవగాహనతో నా భార్య అవయవాలను దానం చేయడానికి నిర్ణయం తీసుకున్నా. ఆమె అవయవాలు నలుగురి ప్రాణాలను నిలబెట్టింది. నా భార్య వారిలో ఇంకా బతికి ఉందనే నిజం మాకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. -ఎమ్.ప్రసాద్, కొండాపూర్
మా నాన్న అంటే మాకు చాలా ప్రేమ. ఓ పెండ్లికి వెళ్లి వస్తుంటే వెనకాల నుంచి ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డాడు. మెదడుకు గాయమవడంతో ఆయన బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. అప్పుడు జీవన్‌ధాన్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో మేము కూడా మా నాన్న అవయవాలను దానం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంతో మా నాన్న మా మధ్యల్లో లేకున్నా మరో ఐదుగురిలో ఉన్నాడనే సత్యం మాకు నిత్యం ఆనందాన్ని ఇస్తుంది. -మల్లేశ్, హోంగార్డు, షాద్‌నగర్
నా కొడుకు వయస్సు 22 ఏండ్లు. బైక్‌పై వస్తుంటే బర్రె అడ్డం వచ్చింది. అది తప్పించబోయి కిందపడి మెదడుకు గాయమైంది. డాక్టర్లు బతకడని చెప్పారు. డాక్టర్లు అవయదానం చేయాలని కోరారు. కొడుకు లేడనే బాధ ఎప్పటికీ ఉన్నా ఇంకా కొంత మందిని బతికిస్తాడనే మంచి పనికి నా భార్య పద్మ కూడా సరేననడంతో అవయవాలను దానం చేశాం. -వెంకటేశ్, శామీర్‌పేట్
మా అమ్మ ఆటోలో బయటికి వెళ్లింది. ఆ ఆటోను మరో ఆటో ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఇంతలో జీవన్‌ధాన్ కో-ఆర్డినేటర్లు మమ్మల్ని సంప్రదించి అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. మా అమ్మ కోరిక మేరకు ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడేలా ఉండాలనే మాటను గుర్తుకు తెచ్చుకుని ఆమె అవయవాలను దానం చేశాం. ఇప్పుడు నలుగురు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. ఒకరికి పునర్జీవనం ఇవ్వడమంటే దైవ సమానమే. -కృష్ణా కిరణ్, గచ్చిబౌలి, ఏఐజీ
అనుమానాలు, అపోహలు వీడండి.బ్రెయి న్ డెడ్ అయిన వారి కుటుంబాలు అవయవదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానం చేసి మరికొందరికి పునర్జీవం ఇవ్వాలి. ఈ ఏడాదిలో సైబరాబాద్ పరిధిలో ఏడుగురు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవదానానికి మద్దతు తెలపడంతో 34మంది ప్రాణాలు నిలబడ్డాయి. అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యు లు అవయవదానం చేయడానికి సిద్ధంగా ఉం టే జీవన్‌ధాన్ సంస్థ ప్రతినిధులకైనా, వారి హెల్ప్లైన్కైనా లేదా సైబరాబాద్ ట్రాఫిక్ ఆర్టీఏఎమ్(రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ మేనేజమెంట్) ఇన్స్పెక్టర్ నంబర్-949061746 1కు సమాచారం అందించాలి.
-సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్