సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు క్రైమ్ విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0ను నిర్వహించగా తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ఘోస్ట్ సిమ్ వ్యవస్థపై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో ఉక్కుపాదం మోపింది.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ర్ర్టాల్లో ఏడురోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 544 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకోగా అందులో 432 సీల్డ్ సిమ్‌లు ఉండగా, 112 ఓపెన్డ్ సిమ్‌లు ఉన్నాయి. వీరిలో 44మంది ఘోస్ట్ సిమ్‌కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్‌కార్డుల సరఫరాదారులు ఉన్నారు.
వీరంతా కలిసి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్‌నేరాల్లో భాగస్వాములైనట్లు తేల్చిన పోలీసులు ఈ సైబర్ నేరాల్లో మోసగించింది మొత్తం 101.87 కోట్లుగా తెలిపారు. టెలికామ్ నెట్వర్క్వారీగా పరిశీలిస్తే అరెస్ట్ అయిన పీవోఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన 10మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారని పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ర్టాల్లో దాడులు జరిగాయి.
సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను విచారించే క్రమంలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ పోర్టబులిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే అదనపు సిమ్‌కార్డును యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో నెట్వర్క్ సరిగా లేదు, సర్వర్ డౌన్ అయింది, వేలిముద్ర సరిగా పడడం లేదంటూ నమ్మబలికి, రెండు మూడు బయోమెట్రిక్‌లు తీసుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి నిరుపేదలను, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్, బయోమెట్రిక్‌లు తీసుకుంటున్నారని పోలీసు విచారణలో తెలిసింది.

ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామని ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్‌కార్డులు సృష్టిస్తున్నారని, తమకు ఎన్ని సిమ్‌లు అమ్మితే అంత కమీషన్‌తో పాటు సైబర్‌నేరగాళ్ల నుంచి కూడా డబ్బులు వస్తుండడంతో ఈ దందా చేస్తున్నట్లుగా పోలీసులకు నిందితులు తెలిపారు. ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్‌లను సైబర్‌నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండా ఆధునికత సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సాధారణ సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే వాటిని ఇ-సిమ్‌లుగా మార్చేసి విదేశాల్లో ఉన్న సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు.
ఈ ఇండియన్ నెంబర్లతో వాట్పాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతోపాటు, మ్యాట్రిమోని సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, అమాయకులకు సైబర్ వల వేస్తున్నారని పోలీసులు చెప్పారు. దీంతో బాధితులనుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్ల రూపాయలు కొల్లగొడుతారని, కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్మెయిల్ సెక్స్టార్షన్ ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే డిజిటల్ అరెస్ట్‌ల ముఠాలు ఈ నెంబర్లనే వాడుతున్నారని వారు పేర్కొన్నారు.
నెంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు నమ్మి మోసపోతున్నారని ఇదంతా ఒక పక్కావ్యూహంతో జరుగుతున్నదని, తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్‌కార్డు యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్‌కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారని సైబర్‌క్రైమ్ పోలీసులు చెప్పారు. ఈ సైబర్ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో సైబర్‌క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు, ఏసీపీ శివమారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ ఘోస్ట్ సిమ్ నెట్వర్క్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ఎయిర్టెల్, జియో, వోడాపోన్ ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. అలాగే డీవోటీ, ట్రాయ్వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి, నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠిన తరం చేయాలని కోరనున్నట్లు సీపీ పేర్కొన్నారు.