రవీంద్రభారతి, జనవరి 29: ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కొనసాగుతున్న హత్యాకాండను ఖండించారు. సుప్రీంకోర్టు సిట్టింగ్‌జడ్జితో ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘నక్సల్స్ పట్ల కేంద్ర ప్రభుత్వ రాక్షస విధానా న్ని ఖండిద్దాం-ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం’ నినాదంతో సెమినార్‌ను నిర్వహించారు. వక్తలుగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, సీపీఐ నాయకులు బోస్, నరసింహారావు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా ఆదివాసీలను క్రూరంగా హత్యలు చేయడం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టులను అంతం చేయాలనే లక్ష్యంతోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. అటవీ సంపదను కార్పొరేటర్లకు దోచిపెడుతుందని, ప్రశ్నించే వారిని ఎన్కౌంటర్లు చేస్తుందని విమర్శించారు. తక్షణమే చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని అబుజ్మడ్ ప్రాంతంలో కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాదులు ఏకమై దాడులను నిలిపివేసే వరకు ఉద్యమించాలని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు.