సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పెట్టుబడి పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా దోచేసిన ఇద్దరు ఘరానా నేరగాళ్లను నగర సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత కథనం ప్రకారం…కేరళకు చెందిన సీహెచ్. నౌషద్, సీహెచ్. అహ్మద్ కబీర్ ఆన్లైన్ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడే నిందితులకు బ్యాంక్ అకౌంట్లు అందిస్తుంటారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ 2021లో కేరళకు చెందిన ఇస్సాక్, తాహెర్ అలీని సంప్రదించి, ఆన్లైన్ మోసాలకు సహకరించాలని కోరారు. అంతే కాకుండా నకిలీ కేవైసీలతో నకిలీ అకౌంట్లను తెరవడంతో పాటు కొన్ని బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుని మోసపూరితంగా నగదు బదిలీ చేసేందుకు వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో 18 ఖాతాల ద్వారా అమాయకుల నుంచి పెట్టుబడి పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు రూ. 26 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అనంతరం దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి ఇండియన్ కరెన్సీని క్రిప్టో ఎక్స్ఛేంజ్ ద్వారా యూఎస్డీటీలోకి మార్చుకుని పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన ఓ వ్యక్తికి అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి బాధితుడి నుంచి రూ. 9.44 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ డబ్బులు వాపస్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు.. నగర సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌క్రైమ్ పోలీసులు.. ఈనెల 11న నౌషద్, అహ్మద్ కబీర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 5 సెల్ఫోన్లు, 8 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.