సిటీబ్యూరో, జనవరి 18(నమస్తే తెలంగాణ): రోజు రోజుకూ హైదరాబాద్ మహా నగరం అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యంత ఆధునిక పోకడలను సంతరించుకుంటున్నది. అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. ఇందుకు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మహా నగరం ఐటీ కారిడార్లోని ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్లు మరింత సువిశాలంగా మారనున్నాయి. రూ.234 కోట్ల వ్యయంతో ఔటర్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న రెండు వరసల రహదారిని నాలుగు వరుసలతో విస్తరించనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఐటీ కారిడార్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రధానంగా జూబ్లీహిల్స్-మాదాపూర్ నుంచి మొదలయ్యే ఐటీ కారిడార్ పరిధి కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్ – కొల్లూరు వరకు విస్తరించింది. జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల కార్యకలాపాలతో పాటు అందులో పనిచేసే వారంతా ఈ చుట్టు పక్కలనే సొంతంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
దీంతో ఒక్కసారిగా తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి నుంచి నార్సింగి మీదుగా కొల్లూరు వరకు ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్డుపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ ప్రాంతంలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టింది. సుమారు రూ.234 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు ప్రారంభించింది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గచ్చిబౌలి చౌరస్తా నుంచి నార్సింగి వరకు, అదే విధంగా తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి నార్సింగి, కోకాపేటల మీదుగా కొల్లూరు వరకు ఉన్న ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డు పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని అధికారులు తెలిపారు.