badangpet | బడంగ్ పేట్, ఏప్రిల్ 20: ఇటీవల బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన షెడ్డు నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.10 లక్షల్లో పూర్తికావాల్సిన ఈ షెడ్డు నిర్మాణానికి ఏకంగా 50 లక్షలు కేటాయించడం పట్ల పలు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో మున్సిపల్ కార్యాలయం, ప్రజా భవనం నిర్మాణం చేసిన వారే ఈ షెడ్డు నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం ఇప్పుడు మరింత అనుమానాలకు తావిచ్చింది.
మున్సిపల్ కార్యాలయ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. భవన నిర్మాణాన్ని రూ.4కోట్లలో పూర్తి చేయాల్సి ఉండగా.. నిర్మాణ ఖర్చు ఏకంగా రూ. 12 కోట్లకు చేరడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ మున్సిపల్ కార్యాలయాన్ని నాసిరకంగానే నిర్మించారని పాలకవర్గ సభ్యులపై విమర్శలు వచ్చాయి. పైగా భవనాన్ని రోడ్డు కంటే కిందకు నిర్మించారు. దీంతో రోడ్డునే తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రజా భవనమైతే నిర్మించిన కొద్దిరోజులకే ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చాయని గతంలో అనేక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. సదరు కాంట్రాక్టర్ మున్సిపల్ కార్యాలయంలో ఏ ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో షెడ్డు నిర్మాణం కోసం రూ.50లక్షలు కేటాయించి, అదే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ చివరి కౌన్సిల్లో తీర్మానం చేశారు.
ఇంత జరిగినా మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు షెడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన అధికారులు.. అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత కాంట్రాక్టర్‌కే షెడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్ప మేలు జరిగేది ఉండదని అంటున్నారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా.. షెడ్డును పరిశీలించిన తర్వాత ఎంతవుతుందో చెబుతామని దాటవేశారు. ఇలాంటి సంఘటనలు మున్సిపల్ కార్పరేషన్‌లో కోకొల్లలుగా జరిగినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు పరిశీలించకపోవడం వల్లనే ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.