బాలానగర్, జనవరి 17 : బాలానగర్ పారిశ్రామిక వాడలో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన ప్రయాణికుల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. వంతెనపై నుంచి ప్రయాణం ఓకే కానీ.. వంతెన కింద నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే యూటర్న్‌లతో దూరాభారం పెరిగింది. బాలానగర్ ఫ్లై ఓవర్ కింద కేవలం రెండు యూటర్న్లు నెలకొని ఉండడం వలన ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. బాలానగర్‌లో ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు మూడు యూటర్న్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడు యూటర్న్‌లను తొలగించి రెండు యూటర్న్లు మాత్రమే ఏర్పాటు చేశారు.
బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రాజుకాలనీ రోడ్డు వరకు ఫ్లైఓవర్ కింద కేవలం రెండు యూటర్న్లు ఉండడం.. దీనికి తోడు నర్సాపూర్ చౌరస్తా జంక్షన్.. ఫతేనగర్ టీ జంక్షన్లు మూసి వేయడంతో ప్రయాణికులకు ప్రయాణం మరింత దూరబారమైంది. తద్వారా అమీర్‌పేట, ఫతేనగర్, సనత్నగర్ల నుంచి చింతల్, జీడిమెట్ల, బోయిన్పల్లి ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీఐటీడీ వద్ద యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. కూకట్పల్లి, జీడిమెట్ల ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఫతేనగర్, అమీర్‌పేట ప్రాంతాలకు వెళ్లాలంటే మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఆర్ఎస్సీ వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. జీడిమెట్ల నుంచి కూకట్పల్లి వెళ్లాల్సిన ప్రయాణికులు బాలానగర్‌లోని ఎన్ఆర్ఎస్సీ వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి రావడంతో దూరం పెరిగింది.
గతంలో ఉన్నచోటే..
బాలానగర్ ఫ్లైఓవర్ కింద ఫతేనగర్ టీ జంక్షన్ నుంచి నర్సాపూర్ జంక్షన్ మధ్యలో (గతంలో యూటర్న్ ఉన్న చోట) యూటర్న్ ఏర్పాటు చేయడం కోసం బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు కసరత్తు ప్రారంభించారు. హెచ్ఎండీఏ అధికారుల సమన్వయంతో ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ ఏర్పాటు ప్రక్రియ పనులను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే యూటర్న్ ఏర్పాటు చేయదలచిన చోట డివైడర్‌ను సైతం తొలగించారు. మధ్యలో సంక్రాంతి పండుగ సమీపించడం వలన సిబ్బంది కొరత ఏర్పడి పనులలో జాప్యం ఏర్పడింది. ఆయా పనులను పది రోజులలో పూర్తి చేసి యూటర్న్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్రాఫిక్ సీఐ నరహరి పేర్కొన్నారు. కానీ ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేయడం వలన రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌కు ఆస్కారం ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు బావిస్తున్నారు. కూకట్పల్లి, జీడిమెట్ల ప్రాంతాల నుంచి ఫతేనగర్ వెళ్లాల్సిన వారు ఎన్ఆర్ఎస్సీ వద్ద ఉన్న యూటర్న్ వరకు వెళ్లకుండా రెండింటి మధ్యలో ఏర్పాటు చేసే యూటర్న్ వద్ద యూటర్న్ తీసుకొని రాంగ్రూట్లో వెళ్లడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
పది రోజుల్లో పూర్తి చేస్తాం..
బాలానగర్ ఫ్లైఓవర్ కింద ప్రయాణికుల సౌకర్యార్థం మూడో యూటర్న్ ఏర్పాటు పనులు చేపట్టాం. రెండు యూటర్న్ల మధ్యలో మరో యూటర్న్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన రావాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. చేపట్టిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తాం.
– నరహరి, బాలానగర్ ట్రాఫిక్ సీఐ