హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. రెండు రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులతో దారుణంగా హతమార్చిన ఘటనను మరువకముందే కామాటిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో హత్య జరిగింది.
దేవిబాగ్ వద్ద అరవింద్ ఘోస్లే (30) అనే వ్యక్తిని వెంబడించి కత్తులతో నరికి చంపారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘోస్లే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం వారాసిగూడ పరిధిలోని బౌద్ధనగర్‌లో కూడా ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న తన మేనమరదలును నరికిచంపాడు.