సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును బల్దియాలో విలీన అంశాన్నీ రాజకీయ డ్రామాగా మార్చి ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు. ‘విలీన అంశం ప్రజా సమస్య.. ఇలాంటి విషయాన్ని పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడాలి. దీక్ష పేరుతో కొందరు మభ్యపెడుతున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ విలీనానికి మద్దతుగా లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించామని, తొలి సంతకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేశారని, ప్రజల ఆకాంక్షను కేంద్రానికి అందజేస్తామన్నారు. విలీనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా లక్ష సంతకాల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్నారు. లక్ష సంతకాల సేకరణను పూర్తి చేసి ఎంపీ ఈటల రాజేందర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, రాహూల్ గాంధీకి సంతకాల కాపీలను పంపిస్తామన్నారు.
కంటోన్మెంట్: కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ దొంగదీక్ష చేసి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని, ఎనిమిది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి కూడా దీక్షకు హాజరు కాలేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. బుధవారం పికెట్ క్యాంప్ కార్యాలయంలో క్రిశాంక్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌కు సంబంధించిన దీక్షకు సంబంధించిన వీడియోల పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేస్తూ మీడియాతో మాట్లాడారు.
విలీనం అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని శ్రీగణేశ్ దీక్షలో ప్రకటించారు..కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్న విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవడం శోచనీయమన్నారు. విలీన అంశాన్ని రాజకీయంగా వాడుకుందామనుకొని..ప్రజల్లో పార్టీలో ఎమ్మెల్యే జోకర్ అయ్యారన్నారు. తలసాని శ్రీనివాస్ సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం శాంతి ర్యాలీ చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే శ్రీగణేశ్ దీక్ష చేపట్టారన్నారు.