బంజారాహిల్స్, జనవరి 25: అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో వెళ్తుండగా కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గా యపడ్డారు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి కొడుకు హర్షవర్ధన్ సాదుల ‘అర్జున్ దేవర’ అనే సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. స్నేహితులతో పాటు బంజారాహిల్స్ రోడ్ నం.13లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు.
శుక్రవారం రాత్రి 1గంట ప్రాంతంలో స్నేహితుడు వంశీతో కలిసి మద్యం తాగుతున్న హర్షవర్ధన్‌కు రాకేశ్ అనే మరో స్నేహితుడు ఫోన్ చేశాడు.. తాను జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో మద్యం సేవించి బయటకు వచ్చానని, పికప్ చేసుకునేందుకు ఎవరినైనా పంపాలని కోరాడు. దీంతో స్నేహితుడు మాడే కార్తిక్, కెమెరామెన్ సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజలు హర్షవర్ధన్‌కు చెందిన మహేంద్ర ధార్ కారులో బయలు దేరారు. బంజారాహిల్స్ రోడ్ నం.12, కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్తున్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సర్కిల్‌కు సమీపంలోకి రాగానే అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఎడమవైపు ఉన్న ఫుట్‌పాత్‌పైకి ఎక్కి పల్టీ కొట్టింది. దీంతో ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి(45) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. మృతుడితో పాటు గాయపడిన వ్యక్తులు యాచకులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదం జరగడంతో కారు నడిపిస్తున్న కార్తిక్‌తో పాటు తేజ కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి, ఎస్ఐ రమేశ్.. ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన కార్తిక్, తేజలతో పాటు కారు యజమాని హర్షవర్ధన్, తదితరులను బంజారాహిల్స్ పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.