Kachiguda | కాచిగూడ, జూన్ 17: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించని డ్రైవర్ అతివేగంగా నడపడంతో లారీ ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి (50) సోమవారం అర్ధరాత్రి కాచిగూడలోని కుమార్ థియేటర్ నుంచి డీమార్ట్ వైపు వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. అదేసమయంలో చాదర్ఘాట్ నుంచి కాచిగూడ వైపుగా వస్తున్న లారీ (TS 02 UB 6111) వేగంగా అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్ సునీల్ కుష్బూను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుని వివరాలు ఇంకా తెలియలేదని.. ఎవరైనా కనిపించకుండాపోతే 8712660543లో సంప్రదించాలని ఎస్సై రవికుమార్ కోరారు.