Drugs | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. నిన్న జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు అయింది. మల్కాజ్గిరి ఎస్వోటీ, కీసర పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రూ. కోటి విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏడు కిలోల ఓపియం, 2 కిలోల పాపిస్ట్రా అనే డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ డ్రగ్స్ దందా అంతర్ రాష్ట్ర సభ్యులు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్‌కు చెందిన లోకేశ్ బరేత్(26) హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఎలాంటి ఉద్యోగం లభించకపోవడంతో డ్రగ్స్ దందాను ఎంచుకున్నాడు. జగదీశ్ గుజ్జర్ అనే మరో యువకుడు లోకేశ్‌తో కలిసి ఈ డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు తేలింది. లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, జగదీశ్ పరారీలో ఉన్నాడు. గత కొంతకాలం నుంచి లోకేశ్ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి రైళ్లలో డ్రగ్స్‌ను తరలిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇవాళ కుందనపల్లి ఓఆర్ఆర్ రోటరీ వద్ద డ్రగ్స్‌ను విక్రయిస్తుండగా.. లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.