హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని నార్సింగి రోటరీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును పోలీసులు సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్ రెడ్డి వద్దకు డబ్బు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు పేర్కొన్నారు. కోకాపేట వాసి సునీల్ రెడ్డి నుంచి రూ. కోటి తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి వెళ్లే దారుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తులను దేవరాజు, శ్రీకాంత్, విజయ్ కుమార్, నాగేశ్, దాసరి లూథర్గా పోలీసులు గుర్తించారు.