మణికొండ, మే 6 : హైదరాబాద్ గండిపేట పరిధిలో కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల గ్రామ సర్వే నంబర 281లో ఎకరం భూమిని విద్యుత్ శాఖకు కేటాయించారు. ఇందులో భాగంగా సర్వే చేపట్టి ఎకరం భూమి హద్దురాళ్లను నాటి విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ సమక్షంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేశ్ ఆధ్వర్యంలో పంచనామా చేసి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏడీఈ అంబేడ్కర్ మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతంలోని నార్సింగి, కోకాపేట, మంచిరేవుల, గండిపేట లాంటి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్న జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ దేశ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు వెలిశాయని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు నూతనంగా మంచిరేవుల సమీపంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం విద్యుత్‌శాఖ నుంచి రూ.5కోట్ల రుణం మంజూరైనట్లు ఏఈడీ అంబేద్కర్ తెలిపారు. భూమి కేటాయింపుల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఉన్నతాధికారులతో కలిసి పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.