అమీర్‌పేట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. నీటి సమస్యలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. చాలా చోట్ల మంచినీటి సరఫరా లేకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో అరకొరగా వస్తున్న నీరు కూడా పూర్తిగా కలుషితమై వస్తుండటంతో అధికారులపై మండిపడ్డారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి జలమండలిని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాగా, చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీలో కలుషిత నీరు సరఫరా అవుతున్న ప్రాంతాల్లో స్థానిక బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్‌రెడ్డి పర్యటించారు. జలమండలి అధికారులతో మాట్లాడి కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పారు.
అమీర్‌పేట్, జూన్ 13: నగర ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నామని, తన ప్ర భుత్వ వైఫల్యాలను పురపాలక శాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల ముందు ఒప్పుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. అసమర్థ పాలనలో పౌరులు మగ్గిపోతున్నారన్నారు. గతంలో ఎ న్నడూ చూడనంతటి దౌర్భాగ్య పరిస్థితులను ప్రజలు చవిచూస్తున్నారన్నారు. తక్షణమే నీటి సరఫరా అంశాన్ని పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి జలమండలిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
శనివారం మాజీ కార్పొరేటర్ ఎన్ శేషుకుమారి, జలమండలి సీజీఎం ప్రభు, డీజీఎం ఆశిష్, మేనేజర్ మౌనికలతో కలిసి అమీర్‌పేట్ డివిజన్లోని బల్కంపేట బస్తీ, కుమ్మరి బస్తీ, బాపూనగర్ బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో అడుగడుగునా నీటి సరఫరా విషయమై స్థానిక మహిళల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. చాలా చోట్ల తాగునీటి సరఫరా జరగదు.. కొన్ని ప్రాంతాల్లో అరకొరగా వస్తున్న నీరు కూడా పూర్తిగా కలుషితమై వస్తోంటే ప్రజల పరిస్థితి ఏంటని అధికారులపై మండిపడ్డారు.
బల్కంపేట బస్తీలో సరఫరా అవుతున్న కలుషిత నీటిని మహిళల ద్వారా ఎమ్మెల్యే తలసాని జలమండలి డీజీఎం ఆశిష్‌కు చూపిస్తూ.. సురక్షితమైన నీటి సరఫరా అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు. ఇక కుమ్మరి బస్తీ, బాపూనగర్ బస్తీల్లో ప్రజలకు నీరందక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు మిన్నంటాయి. బస్తీలకు కనీసం తాగునీటి ట్యాంకర్లను పంపినా తాము సర్దుకుంటామని చెప్పేందుకు తాము కార్యాలయాలకు వెళితే అక్కడ అధికారులు కనిపించరని, ఫోన్లు చేస్తే కట్ చేస్తున్నారంటూ బాపూనగర్ పర్యటనలో ఎమ్మెల్యే వద్ద మహిళలు తమ బాధలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ అమీర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్, నాయకులు దాడి ప్రవీణ్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, సురేందర్‌గౌడ్, లలితా గోపీలాల్చౌహాన్, హరిసింగ్జాదవ్, గులాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.