Balanagar : ఆన్లైన్ మోసాలకు పాల్పడి లక్షలు కాజేసే వాళ్లే కాదు నమ్మించి టోకరా వేసే కేటుగాళ్లు ఈమధ్య ఎక్కువవుతున్నారు. బాలానగర్‌లో ఒక ఓలా ట్యాక్సీ డ్రైవర్ (Ola Taxi Driver) బ్యాంక్ ఉద్యోగులకు మస్కా కొట్టాడు. సిబ్బందిని నమ్మించి రూ.25లక్షల డబ్బులతో ఉడాయించాడు. అసలేం జరిగిందంటే… సికింద్రాబాద్ నుంచి బాలానగర్‌కు బుధవారం సిటీ యూనియన్ బ్యాంక్(City Union Bank) సిబ్బంది ఓలా కారులో వచ్చారు. అప్పటివరకూ వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉన్న ఆ డ్రైవర్.. వాళ్లు కారు దిగి డబ్బుల పెట్టే తీసుకునేలోపే పరారయ్యాడు. ఊహించని ఘటనతో వారంతా షాక్ తిన్నారు.
డ్రైవర్ తమ బ్యాంక్‌కు చెందిన రూ.25లక్షల డబ్బుతో పరారైన విషయాన్ని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు పోలీసులకు తెలియజేశారు. ఈమేరకు అతడిపై స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు డ్రైవర్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.