సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 17 : అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, దవాఖానలు, అపార్ట్మెంట్లలో ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా ఉపయోగించాలని, వ్యాపార సముదాయాలు మూసే సమయంలో విద్యుత్ పరికరాలు పూర్తి స్థాయిలో ఆర్పివేయాలన్నారు.
అగ్ని ప్రమాదాలు జరుగకుండా అగ్ని మాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలువగానే 101కి కాల్ చేసి ప్రమాదం జరిగిన ప్రాంతం, ఖచ్చితమైన ల్యాండ్ మార్క్, ఫోన్ నంబర్‌ను అధికారులకు తెలపాలని సూచించారు. వస్ర్తాలు , టింబర్ డిపో, చెప్పుల గోదాంలు, ఇతర గోదాంల నిర్వాహకులు, అపార్ట్మెంట్లు, దవాఖానల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో అక్కడున్న వారిని ప్రాంతం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, మంటలను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధి కారులు వివరిస్తున్నారు.
అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఉస్మానియా దవాఖాన, అ పార్ట్మెంట్లలో అవగాహన కల్పించారు. గౌలిగూడ ఫైర్ స్టేషన్ అధికారి ప్రవీణ్‌కుమార్ అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు డెమో నిర్వహించి ప్రాక్టికల్‌గా అవ గాహన కల్పిస్తున్నారు. 20వ తేదీ వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో భాగంగా మాక్ డ్రిల్‌ను నిర్వహించడంతో పాటు డెమోల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తగిన జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చు. చిన్నపాటి నిర్లక్ష్యం చేస్తే అగ్ని ప్రమాదాలు సంభ వించి ఆస్తి, ప్రాణ నష్టాలకు దారి తీస్తుంది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సరైన ఫైర్ సేఫ్టీని సకాలంలో ఉపయోగించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే 101కి కాల్ చేయాలి.
– ప్రవీణ్‌కుమార్, గౌలిగూడ ఫైర్ స్టేషన్ అధికారి
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం గౌలిగూడ ఫైర్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో ఫైర్ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను ఝాన్సీ శాంతి నికేతన్ స్కూల్ విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులకు ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలలో వాడే వస్తువులు, పరికరాల వినియోగాన్ని వివరించారు.
– సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 17