సిటీబ్యూరో, జూన్ 16 ( నమస్తే తెలంగాణ ) : ఇప్పటికే విద్యార్థుల ఫీజులు మార్మోగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఆ పిల్లలను స్కూల్, ఇంటికి చేర్చడానికి అయ్యే ఖర్చు సైతం ఏడాది ఫీజులో సగం వరకు ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వాహన సంఘాల నాయకులు సిండికేట్‌గా ఏర్పడి పలు ప్రాంతాలను పంచుకున్నారు. ఆ లెక్కన ఆ ఏరియాలోని పిల్లలను విద్యా సంస్థలకు తరలించాలంటే వాళ్లు చెప్పిన సంబంధిత వాహనాలే ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాదు ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా ఆ వాహనాలను నడిపిస్తుండటంపై అధికారులు మౌనం పాటిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
మోటార్ వాహన నిబంధనలు తమకేం వర్తించవు అన్నట్టుగా నగరంలో వేలాది మారుతి వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు రోడ్లపై యథేచ్ఛగా విద్యార్థులను ఎక్కించుకొని పరుగులు తీస్తున్నాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలు నిర్వహించే బస్సులకు మోటార్ వాహన చట్టంలో పలు నిబంధనలు చేశారు. వాటికి విరుద్ధంగా వ్యాన్లు ఎలాంటి అనుమతులు లేకున్నా, రక్షణ చర్యలు లేకుండా లక్షలాది మందిని విద్యాసంస్థలకు తరలిస్తున్నారు. వ్యాన్లలో భద్రత లేదని గ్రహించిన కొన్ని రాష్ర్టాలు వాటిని నిషేధించిన విషయం తెలిసిందే. అలాంటి వ్యాన్లు మాత్రం ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మోటార్ వాహన చట్టం ప్రకారం నిబంధనల మేరకు వైట్ నెంబర్ ప్లేట్ మారుతి ఓమ్నీ, మెటాడోర్ వంటి వాహనాల్లో స్కూల్ పిల్లలను తరలించడం చేయకూడదనే విషయాన్ని అధికారులు సైతం విస్మరిస్తుండటం విశేషం.
పన్ను ఎగొట్టి..
నగరంలో అనుమతులు లేకుండా తిరుగుతున్న వేలాది వ్యాన్ల వల్ల కార్మిక నాయకులకు కాసుల పంట పండుతుంది. ప్రతి మూడు నెలలోకాసారి పన్నులు చెల్లించడం, పర్మిట్, లైసెన్స్‌లు లేని డ్రైవర్, అదనపు సీట్ల బిగింపు నుంచి రవాణా అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కొంతమంది కార్మిక నాయకులు వారి తరపున వకాల్తా పుచ్చుకొని కొందరు అధికారులతో రాయబారం నడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మార్గంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. గ్రూపులుగా ఏర్పాటై ప్రతిగ్రూప్నకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఎలాంటి అనుమతులు లేకున్నా వారిని ఏమనకుండా వ్యాన్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరిమితికి మించి..!
ప్రతిరోజు సుమారు 20వేల వ్యాన్లు రాకపోకలు సాగిస్తున్నాయి లక్షలాది మంది విద్యార్థులను రవాణా సాగిస్తున్నాయి. కానీ వాటిలో 6వేల మందికి పైగా లైసెన్స్ లేని డ్రైవర్లే ఉన్నారని తెలుస్తుంది. గ్రేటర్లో వేలాది మారుతి, ఓమ్నీ వ్యాన్లు, మెటాడోర్ వ్యాన్లు ఆర్టీఏ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఐదు, ఎనిమిది, 16 సీట్ల వ్యాన్లలో 40 మందికి పైగా తరలిస్తున్నారు. విద్యార్థులను తరలిస్తున్న వాహనాలకు అత్యవసర ద్వారం ఉండాలి. కానీ ఐదుగురు కూర్చోవాల్సిన వ్యాన్లలో 15 మంది వరకు ఎక్కించడం, వాటికి కనీసం పూర్తిస్థాయిలో గాలిని అందించే కిటికీలు లేకపోవడం శోచనీయం. అసలే తక్కువ ఎత్తులో ఉండే వ్యాన్లలో ఎండ వేడిమి ఉంటుంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో విద్యార్థులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
విద్యార్థులను తరలించే ఎలాంటి వాహనమైనా కేంద్ర వాహన చట్టం ప్రకారం సంబంధిత విద్యాసంస్థ అనుమతి ఉండాలి. దాని ఆధారంగా రవాణా శాఖ నుంచి అనుమతి పొందాలి.ఆర్టీఏ నిబంధనల ప్రకారం విద్యా సంస్థ వాహనానికి ప్రత్యేకంగా పసుపు రంగు వేయాలి. స్కూల్ యాజమాన్యం, రవాణా శాఖ అనుమతి పొందిన తర్వాత ఆ విద్యా సంస్థ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, చిరునామా, ఫోన్ నంబర్‌తో పూర్తి వివరాలు వ్యాన్‌పై కనిపించేలా రాయాలి. నిబంధనల ప్రకారం వ్యాన్ యజమానులు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం నిర్ణయించిన సీట్లకు ఇన్సూరెన్స్ చెల్లించాలి.ఏడు సీట్లు దాటినా వాహనం నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కానీ నగరంలో తిరుగుతున్న వ్యాన్లలో ఎన్ని సీట్లు బిగిస్తున్నా ఒక్క రూపాయి చెల్లించకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వ్యాన్ల యజమానులు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి.