మేడ్చల్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో ఉన్న సాల్వో ఇండస్ట్రీస్ అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనులు ప్రభుత్వ భూముల కబ్జాలపై గ్రామస్తులు చేస్తున్న ఫిర్యాదుల మేరకు బార్డర్ ఇష్యూ తేల్చాలని డిప్యూటీ డైరెక్టర్ సర్వే ల్యాండ్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తున్నది. దర్జాగా కబ్జా..అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనుల వ్యవహారంపై ‘నమస్తే’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సాల్వో ఇండస్ట్రీస్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై విచారణకు అధికారులు సిద్ధమవుతున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. సాల్వో ఇండస్ట్రీస్‌కు సంబంధించిన భూముల విషయమై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అధికారితో చర్చించి విచారణ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఉమ్మడి నల్గొండ జిల్లా రామలింగంపల్లి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్య బార్డర్ ఇష్యూ ఉంది. దీంతో ఇదే అదనుగా భావించి సాల్వో ఇండస్ట్రీస్.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 886లో 19 ఎకరాలు, 887 సర్వే నంబర్లో 10 ఎకరాలు, 918 సర్వే నంబర్లో 295 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, బార్డర్ ఇష్యూ పేరిట అధికారులు సాల్వో ఇండస్ట్రీస్ పెద్దలకు అండగా నిలుస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాల్వో ఇండస్ట్రీస్ ఉన్న రెండు గ్రామాల మధ్య బార్డర్ ఇష్యూను తేల్చేలని ఇచ్చిన ఆదేశాలను తేల్చేలా డిప్యూటీ డైరెక్టర్ సర్వే ల్యాండ్ అధికారితో కీసర ఆర్డీవో, కీసర తహసీల్దార్లు ఉండి బార్డర్ ఇష్యూను తేల్చాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
కాలయాపన చేసేందుకేనా..
గతంలోనే రామలింగపల్లి, అంకిరెడ్డిపల్లి మధ్య బార్డర్ ఇష్యూపై డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్ సర్వే అధికారులు సర్వే చేశారు. అయితే సర్వేకు సంబంధించిన నివేదికలు ఉన్నతాధికారుల వద్దే ఉన్నాయి. ప్రసుత్తం ఉన్న నివేదికలు కాకుండా మరో సారి సర్వే చేయాలని ఎందుకు ఆదేశించారో అంతు చిక్కని ప్రశ్నగా కనపడుతుంది. సాల్లో ఇండస్ట్రీస్‌కు మద్దతుగా ఉండి కాలయాపన చేసేందుకే తిరిగి బార్డర్ ఇష్యూ పేరిట సర్వే చేయనున్నారా…? అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 918, 886, 887 సర్వే నంబర్లలో 325 ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించిందని 1954 నుంచి 2024 వరకు సెత్వారు, కాస్రా ఆన్లైన్ రికార్డుల్లో అంకిరెడ్డిపల్లికి చెందిన ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో స్పష్టంగా ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌లు చేస్తూ రెండు చెరువులు కబ్జాకు గురైనట్లు ఆరోపణలొస్తున్నాయి. అయితే సాల్వో ఇండస్ట్రీస్ యాజమాన్యానికి సీఎం కార్యాలయంలోని ఓ వ్యక్తి మద్దతుగా నిలుస్తుండటం వల్లే తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.