సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియలో అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఓటరు కార్డుల పంపిణీ చేయడం మొదలుకొని స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు వరకూ అధికార యంత్రాంగం వ్యహవరిస్తున్న తీరుతో జూబ్లీహిల్స్‌లో అసలు ఏం జరుగుతుందనే సందేహం అందరిలో వ్యక్తమవుతున్నది. రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా కానుండటంతో రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి అనేక వివాదాలు చోటుచేసుకోవడం, బోగస్ ఓట్ల ఏరివేసేందుకూ అధికారులు తిరకాసు వివరణలు ఇవ్వడం.. వంటివి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు తావిస్తున్నది.
ఈ నియోజకవర్గంలో వేలాదిగా బోగస్ ఓట్లు బయటపడటం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ సర్కారుతో విధాలా విసిగిపోయిన బాధితులను నామిషనేష్ వేయకుండా అధికారులు అడుగడుగునా అడ్డుపడ్డారు. కాంగ్రెస్ బాధితులు వందలాదిగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమైతే ఎలక్టోరల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నామినేషన్ల ప్రక్రియలోనూ కుంటిసాకులతో స్వంతంత్ర అభ్యర్థులను దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. స్క్రుటినీలోనూ చిన్నచిన్న కారణాలను చూపి భారీగా తొలగించారు. నామినేషన్ల ఉప సంహరణలోనూ అధికారులే విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిళ్లకు గురిచేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లవెత్తాయి. ఇప్పుడు ఏకంగా నామినేషన్ పత్రాల్లో ఫొటోలు సరిగ్గా లేకపోవడం వల్లే గుర్తుల కేటాయింపు ఆలస్యమవుతుందని చెప్తున్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్న మేధావులు.. అధికారులు.. ఈ విధానాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఎన్నికల సంఘం నేరుగా ఓటరు కార్డులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం అధికారికంగా అందజేయాలి కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా ఒక సమావేశంలో బహిరంగంగా పంచారు. జీహెచ్ఎంసీ ప్రాంతీయ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న యూసుఫ్‌గూడలో నిర్భయంగా ఓ పార్టీ నేత ప్రభుత్వం చేయాల్సి పనిని చేసినా చూసీచూడనట్లు వదిలేశారు. ఈ వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చేదాకా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ తర్వాత కదిలొచ్చిన మున్సిపల్ అధికారులు మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటన విడుదల చేసి మౌనం వహించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరు ఆశ్చర్యం కలిగించింది. ఎన్నికల కమిషన్ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా వేలాదిగా బోగస్ ఓట్లు బయటపడటం సంచలనం సృష్టించింది. ఒకే చిరునామాతో వందలాది ఓట్లున్నట్లు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. పూర్తి ఆధారాలతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో దొంగ ఓట్లను బయటపెట్టారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దొంగ ఓట్లు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్న అధికారులు నామమాత్రపు తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. బయటపడిన బోగస్ ఓట్లన్నీ గత ఎన్నికల సమయంలోనూ ఉన్నాయని ప్రకటనలకే పరిమితమయ్యారు. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్లు బయటపడ్డా ఎన్నికల అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. దొంగ ఓట్లున్న ఇండ్లకు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి తూతూమంత్రంగా విచారణ చేపట్టారు. కోర్టు సమాధానం చెప్పాలని మొక్కుబడి విచారణ చేశారు. బోగస్ ఓట్లన్నీ అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటం వల్లే అధికారులు ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు చేసినా ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నవీన్‌యాదవ్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ తీసి పెద్ద సంఖ్యలో బౌన్సర్లు, రౌడీషీటర్లు, నేర చరితులు, వ్యభిచార నిర్వాహకులతో కలిసి డీజే చప్పుళ్ల నడుమ వందలాది మందితో నానా హంగామా చేశారు. కత్తులు కటార్లతో రౌడీలు రోడ్లపై విన్యాసాలు చేశారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. నవీన్‌యాదవ్ ర్యాలీ వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చుట్టూ 8 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి విధులకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంత జరిగినా ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కూతురు ప్రచారంలో ఎలాంటి ఆర్భాటాలు లేకున్నా పోలీసులు అడ్డుకున్నారు. మహిళ అని చూడకుండా కేసు నమోదు చేశారు.
స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంలోనూ అధికారులు జాప్యం చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. వారిని అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందనే ఆలస్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. చిహ్నాలు కేటాయించకపోవడంపై శనివారం ఆర్వో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఎన్నికల అధికారులు అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బాధితులు వందలాదిగా నామినేషన్లు వేసేందుకు రావడంతో ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు అవుతాయని, అధికార పార్టీకి నష్టం జరుగుతుందని భారీగా తగ్గించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే నామినేషన్ల స్వీకరణ సమయంలోనే స్వతంత్ర అభ్యర్థులను గుర్తించి మరీ కట్టడి చేశారు. పత్రాలు జతచేయడం, ప్రాధాన్యం లేని కాలమ్స్ నింపలేదని వెనక్కి పంపించారు.
300కి పైగా దాఖలు కావాల్సిన నామినేషన్లను 211కు కుదించారు. స్క్రూటినీ పేరిట పూర్తిగా తగ్గించేసి 81కి తీసుకొచ్చారు. అధికారుల పేరిట ఫోన్లు చేసి మరీ, ఆర్వో కార్యాలయానికి రప్పించి 23 మందిని వివిధ రకాలుగా ఒత్తిళ్లకు గురిచేసి తిరస్కరించేలాగా చేశారు. ఇన్ని విధాలుగా ప్రయత్నించి, అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న 58 మంది అభ్యర్థులను ఈసీకి పంపించారు. అయినా ఫొటోలు సరిగ్గా లేవని ఈసీ అభ్యంతరం తెలిపిందని చెప్తున్నారు. తమకు గుర్తులు కేటాయించడంలో జాప్యం చేసేందుకే కుంటిసాకులు చెప్తున్నారని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వివిధ దశల్లో వడపోత చేసినా ఇంకా తప్పిదాలెలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నరు. మేం ప్రచారం చేస్తే కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరుగుతుందనే ఒకే ఒక్క కారణంతో గుర్తులు, సీరియల్ నెంబర్లు కేటాయించకుండా జాప్యం చేస్తున్నరు. మేం ప్రచారానికి వెళ్తే కాంగ్రెస్ ఓడిపోతుందని భయపడుతున్నరు. వివిధ దశల్లో వడపోత చేసిన పత్రాల్లో ఫొటోలు తప్పుగా ఉన్నయని కుంటిసాకులు చెప్తున్నరు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మమ్మల్ని ఆర్వో కార్యాలయం ముందు కూర్చోబెట్టి గుర్తులు, సీరియల్ నెంబర్లు ఇవ్వకుండా వెనక్కి పంపారు. నిబంధనల ప్రకారం ఉపసంహరణ పూర్తయిన మరుసటి రోజే గుర్తులు, సీరియల్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటది. కావాలని నామినేషన్ దాఖలు నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని వేధిస్తున్నరు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తం.
– రాథోడ్ రవీందర్ నాయక్, స్వతంత్ర అభ్యర్థి