ఖైరతాబాద్, సెప్టెంబర్ 20 : రాష్ర్టానికి ఆయన ప్రథమ పౌరుడతను.. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో మాట ఇచ్చారంటే అది నెరవేర్చాల్సి ఉంటుంది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు..రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయనట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఆయన దత్తత తీసుకున్న బస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. దీంతో ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ బస్తీ వాసులు మురికి కూపంలో, శిథిల భవనాల్లో బతుకులు వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులు శ్రద్ధ చూపరు. గవర్నర్ దత్తత తీసుకున్నా తమ బతుకులు మారలేదంటూ వాపోతున్నారు.
గతేడాది సెప్టెంబర్ 17న గవర్నర్ కార్యాలయం నుంచి ఇందిరానగర్ బస్తీని గవర్నర్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన వచ్చింది. వెంటనే అధికార యంత్రాంగం మొత్తం బస్తీకి తరలివచ్చింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచనల మేరకు ఇక్కడ పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ, మంచినీరు, రోడ్ల అభివృద్ధితో పాటు శిథిలావస్థకు చేరుకున్న ఇందిరానగర్ ఇండ్ల సమస్యకు పరిష్కార మార్గం చూపాల్సి ఉంది. అదే నెల 27న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధికారిక పర్యటన సైతం ఏర్పాటు చేశారు.
గవర్నర్ పర్యటనకు వారం రోజుల ముందే అధికారులు హడావుడి చేశారు. జలమండలి అధికారులు నీటి నాణ్యతను పరిశీలించారు. మురుగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆరా తీశారు. వెటర్నరీ అధికారులు వీధి కుక్కలన్నింటినీ తరలించాలని ఆదేశించారు. ఎక్కడా చూసినా..వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టడం కనిపించింది. అంతెందుకు గవర్నర్ రాకకు గంట ముందు వరకు కూడా అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమైనట్లు కనిపించారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యాలయం నుంచి ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ బస్తీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన వెలువడి ఏడాది పూర్తయ్యింది. గతేడాది సెప్టెంబర్ 27న గవర్నర్ స్వయంగా ఇంటింటికీ వెళ్లి అక్కడి ప్రజల స్థితిగతులు, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశం రాజ్‌భవన్, సెక్రటేరియేట్‌కు అతి సమీపంలో ఉన్న ఈ బస్తీని అభివృద్ధి చేసేందుకు గవర్నర్ దత్తత తీసుకున్నారని, కాలనీలో స్వచ్ఛత పెంపొందించడంతో పాటు ప్రతి ఇంటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బస్తీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. అదే క్రమంలో గవర్నర్ స్వయంగా అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ సైతం చేయించారు.
ఏడాది గడించింది. గవర్నర్ ఇచ్చిన హామీలేవి అమలు కాకపోగా, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. గవర్నర్ పర్యటన తర్వాత జీహెచ్ఎంసీ, జలమండలి తదితర విభాగాల అధికారులు, సిబ్బంది తిరిగి బస్తీ ముఖం చూడలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బస్తీలో ఎక్కడా చూసినా మురుగు ఏరులై పారుతోంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
రోడ్లన్నీ గతుకులమయమై కనీసం నడిచేందుకు కూడా వీలులేకుండా పోయాయి. పారిశుధ్యం లోపించి దోమలు వ్యాప్తిచెందడంతో ఆస్పత్రులకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఇటీవల డెంగీ కేసులు సైతం నమోదైనట్లు తెలిసింది. రాష్ట్ర ప్రథమ పౌరుడి మాటలను అధికారులు, అధికార యంత్రాంగం లెక్కలోకి తీసుకోకపోవడం వల్లే తమకు దుస్థితి నుంచి విముక్తి లబింభలేదని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ మాటకే విలువ లేకుంటే తమ కష్టాలు ఎవరు తీరుస్తారంటూ వాపోతున్నారు. ప్రథమ పౌరుడి విలువైన ప్రకటనను బేఖాతరు చేసిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.