సిటీబ్యూరో, ఆగస్ట్ 6 (నమస్తే తెలంగాణ): అమీర్‌పేట ప్రాంతంలోని ఆ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ‘అమ్మవారి దేవాలయంలో నిధుల స్వాహా, బంగారం పదిలమేనా’ అంటూ నమస్తే తెలంగాణలో వస్తున్న వరుస కథనాలపై దేవాదాయశాఖ ఉద్యోగులు అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఈ కథనాలతో కొందరు భక్తులు.. తాము విరాళాలిచ్చినా రసీదులివ్వని వాటిపై అధికారులను, అర్చకులను ప్రశ్నించినట్లు తెలిసింది.
ముఖ్యంగా ఆ అధికారి తన బంధువులైన అర్చకుడు, సీనియర్ అసిస్టెంట్‌తో కలిసి చేస్తున్న వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి వచ్చినప్పటి నుంచి ఆలయంలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పించారని దీనిపై కొందరు స్థానికులు హెచ్చరించినా తమకు పెద్దవారి అండ ఉన్నదని ముఖ్యంగా తమ వర్గానికి చెందిన మంత్రి పేరు చెప్పి పెట్రేగిపోతున్నట సమాచారం. తనకు అధికారం లేకున్నా కమిషనర్.. పాత ఈవోపై ఉన్న కోపంతో ఇచ్చిన ఒక మెసేజ్‌ను అందరికీ చూపిస్తూ తనకే బాధ్యతలు ఉన్నాయంటూ అనధికారికంగా లక్షల రూపాలయల చెక్కులపై సంతకాలు పెడుతున్న సదరు అధికారి భాగోతంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేషీ అధికారుల అండదండలు..!
ఆ అధికారికి సొంత శాఖ మంత్రి పేషిలో ఉన్న ఇద్దరు అధికారుల అండ ఉండటంతోనే అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నట్లు సమాచారం. బంగారం పోయినా, సేవింగ్స్ నిధులు దుర్వినియోగం అవుతున్నా కమిషనర్ నుంచి కానీ విజిలెన్స్ అధికారులు కానీ కనీసం స్పందించకపోవడంపై ఆ శాఖ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితి మరో అధికారికి ఉంటే ఈ పాటికి సస్పెండ్ చేసేవారని, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్ ఉందని టాక్.
మంత్రి పేషిలో పనిచేస్తున్న ఓ అధికారికి ఈ ఆలయ అధికారి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టచెప్పారని, అవి నేరుగా ఇవ్వడంతో పాటు వాటిలో కొంత భాగం మరో మంత్రి బంధువుకు ముట్టజెప్పినట్లు ఆశాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ పేషి అధికారి ఇటీవల ఓ అధికారిని బదిలీ చేయించే విషయంలో కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇతని రేటు కూడా రూ.15 లక్షలుగా ఫిక్స్ అయిందని, అంతకంటే తక్కువ తీసుకునేది లేదని, ఒకవేళ ఇస్తే ఏ ఆర్డర్ అయినా తారుమారు చేస్తారని ఆయనకు పేరున్నట్లు బొగ్గులకుంట ఆఫీసులో చెవులు కొరుక్కుంటున్నారు.
పేషిలో ఉన్న మరో అధికారికి అమ్మవారి ఆలయ అధికారికి మధ్య సన్నిహిత స్నేహం ఉందని, ఆయనతో పాటు ఆలయ అధికారి అన్న పనిచేసిన సంబంధాలతో ఇతని విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ పేషి అధికారి దేవాదాయ ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఆలయ అధికారి లీలలన్నీ ఆయన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులేదైనా చర్యలు తీసుకుంటే తమకు ఇబ్బంది అవుతుందని భావించి వారికి పెద్ద ఎత్తున ముడుపులు, బంగారం, డబ్బులు, చీరెల రూపంలో సమర్పించుకోవడానికి సిద్దమవుతున్నట్లు దేవాదాయ శాఖలో టాక్. మరి దేవాలయ సొమ్మును, అమ్మవారి ఆలయాన్ని రక్షించాల్సినవారే భక్షిస్తుంటే వారికి పేషి అధికారులు, మంత్రి సహకరిస్తుంటే ఇక సామాన్యుడి పరిస్థితేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ.. బంగారం ఉందా లేదా..!
అసలు దేవాలయ అధికారి పరిధిలో ఉండాల్సిన బంగారం విషయంలో ఇప్పటికీ నాన్చుడు ధోరణే కనిపిస్తోంది. తనకు ముందున్న అధికారులు బంగారం లెక్కలు అప్పగించలేదన్న సాకుతో ఎలాంటి అధికారం లేని ఆ అధికారి అర్చకుడితో కలిసి సొంత వ్యవహారం నడిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అసలు బంగారం ఎంత ఉంది.. గర్భగుడిలో ఉన్నదెంత.. బోనాల సమయంలో అమ్మవారికి చేయించిన ఆభరణాలు, నగలపై ఆలయ అధికారి, అర్చకుడు ఇద్దరూ ఏం చేశారన్న అంశాలపై దేవాదాయ ఉన్నతాధికారులు ఆరా తీశారు. అందులో ఓ దాత ఇచ్చిన నగపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
పేషి అధికారులతో పైరవీ..
ఈలోగా అధికారి తనకు అండదండలుగా ఉన్న పేషి అధికారులతో దేవాదాయ ఉన్నతాధికారులకు ఫోన్ చేయించి తాను చెప్పేవరకు ఆ ఆలయ అధికారి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పించినట్లు ఆ శాఖలో చర్చిస్తున్నారు. ఇందుకు తాను ఈ పోస్ట్‌లోకి రావడానికి ముందే పేషి అధికారి ఒకరికి ముడుపులు ముట్టజెప్పగా అతను మంత్రిగారి సంబంధీకుడికి కొంత ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నట్లుగా సిబ్బంది చెప్పుకుంటున్నారు. అమ్మవారి ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులతో పాటు ఆలయ నిధులకు కూడా భద్రత కల్పించాల్సిన ఉన్నతాధికారులు పేషి ఒత్తిళ్లకు భయపడి ఆ ఆలయ విషయం మాట్లాడడానికి వెనకాడుతున్నారని దేవాదాయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అయితే భక్తులు, దాతలు సమర్పించిన విరాళాలు, నగల విషయంలో పారదర్శకత లోపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.