కాటేదాన్ ఇండోర్ స్టేడియంలో అసంపూర్తిగా పనులు
14 ఏండ్లుగా ఎదురుచూపులు
గేట్ సమస్యతో ఆలస్యమవుతుందంటున్న అధికారులు
మైలార్‌దేవ్‌పల్లి, మార్చి27: ఏండ్లు గడుస్తున్న మైలార్‌దేవ్‌పల్లి కాటేదాన్ ఇండోర్ స్టేడియం ప్రారంభానికి నోచుకోలేదు. హెచ్ఎండీఏ అధికారులు నామ మా త్రంగా పనులు ముగించుకొని చేతులు దులుపుకున్నారు. ఆరు నెలలుగా పనులు నిలిచి పోవడంతో స్టేడియం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నది. సుమారు తొమ్మిది ఎకరాల్లో ఉన్న స్టేడియంలో క్రీడల నిర్వహణ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. స్థానికుల కోరిక మేరకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనేక సార్లు అధికారులను స్టేడియానికి రప్పించి అక్కడి సమస్యలను జీహెచ్ఎంసీ అధికారులకు వివరించారు. అప్పుడప్పుడు ని ధులు మంజూరు చేయించారు. మంజూరైన డబ్బులతో నామమాత్రం పనులు చేస్తున్నారు. మిగతా పనులు మొదలు పెడుతామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. స్డేడియం పనులు మొదలు పెట్టి 14 ఏండ్లు గడుస్తున్న ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయారు. స్టేడియంలో స్మిమ్మింగ్ ఫూల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ,షటిల్, స్కేటింగ్ ర్యాంక్ వంటివి పూర్తి కాగా స్టేడియంలో ట్రాక్‌లు, విద్యుత్ తదితర సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఈ ఏడాది అయిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించాలని క్రీడాకారులు కోరుతున్నారు.
గేట్ సమస్యతో ఆలస్యం
స్టేడియం పనులు 90 శాతం పూర్తి చేశాం. స్విమ్మింగ్ ఫూల్ పనులు ఈ మధ్యనే పూర్తి చేశాం. స్టేడియం ప్రధాన గేట్ వద్ద ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉండటంతో ఆలస్యమవుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు సమస్యను క్లియర్ చేస్తే ఇతర పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తాం. –దత్తు, జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్
రోడ్డు పనులు పూర్తి చేస్తాం
స్టేడియం ప్రధాన గేట్ సమస్య పరిష్కరించాలని ఉన్నతాధితారులు ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తుల భూమికి నష్టపరిహారం కింద డబ్బులు మంజూరయ్యాయి. వారికి ఇవ్వగానే ప్రధాన గేట్ ముందు రోడ్డు వేసి పనులు పూర్తి చేస్తాం.
–నరేందర్ గౌడ్, రాజేంద్రనగర్ సర్కిల్ ఈఈ